ANITHA: కక్ష సాధింపులు ఉండవ్‌

స్పష్టం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత... రెడ్‌బుక్‌పై తొలిసారి స్పందన;

Update: 2024-06-28 03:30 GMT

తమ ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపులకు ఆస్కారం లేదని ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తమకు కక్ష సాధింపు, ప్రతీకారం ఉంటే ఇంతవరకూ ఆగుతామా అని ప్రశ్నించారు. డీజీపీ, ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్‌పై స్పందించిన ఏపీ హోంమంత్రి.. అది కక్ష సాధింపు చర్యలకు కాదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని కూడా అనిత స్పష్టం చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతోమందిని ఇప్పటికే ఎంతో మందిని అరెస్ట్‌ చేసేవాళ్లమని .. కానీ ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని చెప్పారు. తమ నాయకుడు, సీఎం చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని తెలిపారు. మహిళలకు రక్షణ, గంజాయి నిర్మూలన, పోలీసుల సంక్షేమం, పోలీస్ శాఖలో నియమకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కొంతమంది ఐపీయస్ అధికారులు వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని, ప్రజలు ధైర్యంగా పీఎస్‌కు వెళ్లి తమ బాధలు చెప్పుకునే భరోసా ఇవ్వాలని, స్టేషన్‌లో సిబ్బంది కూడా ప్రజలతో మర్యాదగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యం అయిన ఘటనలు చాలా ఉన్నాయని, ఎవరైనా వస్తే వారిని కించపరిచేలా అధికారులు మాట్లాడవద్దని సూచించారు. పోలీసు అంటే ప్రతిపక్ష పార్టీలు అరెస్టులకే అనే విధంగా గత ప్రభుత్వం ఉపయోగించిందన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని, ప్రజలతో మంచిగా మాట్లాడాలని సూచించారు. సచివాలయ పోలీసులను ఏవిధంగా వినియోగించాలో ఆలోచన చేస్తామన్నారు.

సోషల్ మీడియాలో‌ నేటికీ తాను బాధితురాలినేనని, అసభ్య పోస్టులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు చాలా పెట్టారని, తన మీదే 23 కేసులు ఉన్నాయన్నారు. అక్రమ కేసులను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము పగ, ప్రతీకారాల ఆలోచన చేయడం లేదని, పోలీసు అంటే ప్రజల్లో ఒక నమ్మకం, గౌరవం తీసుకొస్తామన్నారు. దిశ చట్టమే ఏపీలో లేదని.. ఇక స్టేషన్ల పేరు కూడా మార్చే ఆలోచన చేస్తామన్నారు. హోంశాఖకు ఎంత నిధులు అవసరమో ఒక నివేదిక సిద్దం చేశామని, ప్రాధాన్యత ప్రకారం కేటాయిస్తూ ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. నిధుల కొరత వల్ల ఒకేసారి అన్నీ చేయలేమని చెప్పారు. చాలా చోట్ల సిసి కెమెరాలు, ప్రింగర్ ప్రింట్ స్కానర్‌లు పని చేయడం లేదని, వైసీపీ ప్రభుత్వం ‌వాటిని అసలు పట్టించుకోలేదని అన్నారు. ఎలాంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులను పెట్టారని.. ఏ విధంగా వారు పోలీసు విధులు నిర్వహిస్తారని హోంమంత్రి అన్నారు. వారి సేవలు ఏ విధంగా వినియోగించాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి రవాణా బాగా పెరిగిందని.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌లో రాష్ట్రాన్ని మూడో స్థానంలోకి తెచ్చారని అన్నారు.


Tags:    

Similar News