AP: ఏపీలో రూ.1.5 లక్షల కోట్లతో భారీ స్టీల్ ప్లాంట్
అమరావతికి క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు
పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ దూసుకెళ్తోంది. ఏఐ డేటా సెంటర్లతో విశాఖ రూపురేఖలు మారనున్నాయి. దాని అనుబంధంగా మరిన్ని సంస్థలు విశాఖవైపు మొగ్గు చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ (AM/NS) భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ ఏర్పాటు చేసే భారీ ఉక్కు కర్మాగారానికి భారత పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ పర్యావరణ అనుమతికి సిఫారసు చేసింది. రూ. 1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో స్థాపించనున్న ఈ స్టీల్ ప్లాంట్, సంవత్సరానికి 8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు తయారీ కర్మాగారంగా నిలవనుంది.
విశాఖ సమ్మిట్‌లో భూమిపూజ
నవంబర్ 14,15 తేదీల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి పూజను విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సమ్మిట్‌లో చేయనున్నారు. ఈ కర్మాగారాన్ని అత్యాధునిక సాంకేతికతతో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, అత్యంత తక్కువ వాయు కాలుష్యం ఉండేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నారు. AM/NS కర్మాగారాన్ని వివిధ దశల్లో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో 8.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టగా, చివరగా 24 మిలియన్ టన్నుల సామర్థ్యం వరకు విస్తరించనున్నారు. ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ కర్మాగారం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్‌లో ప్రధాన పరిశ్రమగా స్థానంలో నిలవనుంది. దీనికి అనుబంధంగా ఉక్కు ఆధారిత ఔట్పుట్ యూనిట్లు, యంత్ర పరికరాల (మిషనరీ) తయారీ క్లస్టర్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు వంటివి అభివృద్ధి చెందుతాయి. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు లభించే వరకు సింగిల్-విండో మాధ్యమం ద్వారా తక్షణ సహాయ సహకారాలను అందించింది.
మరోవైపు.. అమరావతి రాజధానికి వెళ్లే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ-3 రోడ్డును పాత జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు కేఎల్‌రావు కాలనీ వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ వంతెన నిర్మించేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) రూ.70 కోట్లతో పనులు ప్రారంభించింది.