AP: ఆంధ్రప్రదేశ్‌లో లక్ష కోట్ల పెట్టుబడులు
వచ్చే 5 ఏళ్లలో సాధిస్తామన్న చంద్రబాబు... భవిష్యత్తు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానిదే అన్న సీఎం.. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు
వైసీపీ పాలనలో ఎదురైన చేదు అనుభవాలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడిదారులను కోరారు. వచ్చే ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ. లక్ష కోట్ల మేర పెట్టుబడులు సాధిస్తామని తెలిపారు. విశాఖలో జరిగిన ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 175 నియోజక వర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నానమని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. అగ్రిటెక్ రంగంలో బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ట్రేసబిలిటి, సర్టిఫికేషన్లకు, ప్రాడెక్టు పర్ఫెక్షన్కు ఏపీ అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇప్పుడు ప్యాకేజింగ్ అనేది ఇప్పుడు ప్రధాన సవాలుగా ఉందని, దీనిపై కూడా ఏపీ పనిచేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. "ఈసారి నేనే సీఎం, నేను ఏమాత్రం నిర్లక్ష్యం చేయను. నూతనంగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం భవిష్యత్తులో కూడా కొనసాగేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నా హామీమీద పెట్టుబడులు పెట్టండి, భయపడాల్సిన అవసరం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0
ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. " ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలిస్తున్నాం. రూ. 200 కోట్ల పెట్టుబడులు దాటితే మెగా ప్రాజెక్టుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆవిష్కరణలకు కూడా పెద్ద పీట వేసేందుకు ఏపీ సిద్ధం. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో గతేడాదిగా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులకు ఇదే మంచి సమయం, ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు ఇచ్చేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. రిస్క్ లయబిలిటీ చాలా తక్కువగా ఉంది. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి. వ్యవసాయాన్ని లాభదాయకంగా - సుస్థిరంగా మార్చటమే నా లక్ష్యం. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఏపీ చాప్టర్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించటం సంతోషదాయకం.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులుకు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని.. ఏపీ అభివృద్ధి కోసం వంద శాతం కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఏపీ రైస్‌బౌల్ ఆఫ్ ఇండియా
ఆక్వా, బెవరేజెస్ రంగాల హబ్‌గా ఏపీ ఎదుగుతోందని చంద్రబాబు ఉద్ఘాటించారు. పెట్టుబడిదారులు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా తదితర రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. వీటన్నిటికీ వేగంగా అనుమతులు ఇస్తామని తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలా.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బిల్‌గేట్స్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. దేశంలోని పండ్ల ఉత్పత్తుల్లో 25 శాతం ఏపీ నుంచే వెళ్తున్నాయని చంద్రబాబు వెల్లడించారు. రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ డోర్న్ సిటీగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఏపీలో 9 ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఉన్నాయని వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందని ఉద్ఘాటించారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. విలువ జోడించిన ఫుడ్, సీఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో టీపీసీఐ ఈ సదస్సు నిర్వహిస్తోందని వెల్లడించారు.
డబ్బుల పంపిణీతో దేశానికి నష్టమే
దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ ఎక్కువగా జరుగుతుందని, ఈ డబ్బును తిరిగి పొందేందుకు నేతలు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తానే మొదటి నుంచి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. "రూ.100, రూ.200 నోట్లను తప్ప, రూ.500 నోట్లను రద్దు చేయాలి" అని అన్నారు. "ఆర్థిక అసమానతలను తొలగించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. సమాజం నుంచి సంపాదించిన వారే తిరిగి సమాజానికి ఉపయోగపడాలి. ఒకవైపు మిలియన్ల, ట్రిలియన్ల ఆస్తులు కలిగినవారు ఉన్నారు, మరోవైపు నిత్యం ఆకలితో బాధపడే పేదలు ఉన్నారు. ఈ అసమానతల నివారణ నాపై ఉన్న బాధ్యత. పీ4 విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం. పారిశ్రామికవేత్తలు పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారికి దిశానిర్దేశం చేయాలి" అని కోరారు.