ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల సరకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఎయిర్పోర్టులు, పోర్టుల అభివృద్ధి, మారిటైం పాలసీలో తీసుకురావాల్సిన మార్పులు తదితర అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఏపీలో 20 పోర్టులు, మరిన్ని ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి పోర్టు, ఎయిర్ పోర్టుల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానించేలా శాటిలైట్ టౌన్ షిప్లను అభివృద్ధి చేయాలన్నారు.