AP : ఏపీలో జర్నలిస్టులకు రూ.2 లక్షల వైద్యసేవలు

Update: 2024-07-13 07:27 GMT

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసింది. సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం పొడిగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు.

ఈ పధకం ద్వారా అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ ఎస్ ) తరహాలో వైద్య సేవలు పొందవచ్చన్నారు.

వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా పొందే వైద్యసేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని, అదే విధంగా నిర్దేశిత చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ పథకానికి నందమూరి తారకరామారావు వైద్య సేవ ట్రస్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా, అదే విధంగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తాయని శుక్లా తెలిపారు.

Tags:    

Similar News