AP pegasus: పెగాసస్ పేరుతో జగన్ ప్రభుత్వం కొత్త డ్రామా..
AP pegasus: పెగాసస్ స్పైవేర్‌ను చంద్రబాబు ప్రభుత్వం కొన్నదా.. దానిపై జగన్ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయా?;
AP pegasus: పెగాసస్ స్పైవేర్‌ను చంద్రబాబు ప్రభుత్వం కొన్నదా.. దానిపై జగన్ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయా? మమత బెనర్జీ చెబితే తప్ప పెగాసస్ కొన్నారో లేదో తెలుసుకోలేని అట్టడుగు స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందనుకోవాలా? సహజంగా ఒక ఆరోపణను పట్టుకుని విపక్షాలు రచ్చ చేస్తుంటాయి. ఇక్కడ ఉన్నది జగన్ ప్రభుత్వమేగా. ఏం.. ఆమాత్రం ఎంక్వైరీ చేసుకోలేకపోతోందా?
అసలు ఆధారాలు లేకుండానే ఆరోపణ చేయడం, దానిపైనే రచ్చచేయడం వైసీపీకి ఉన్న అలవాటు కాదా? ఒకప్పుడు పింక్ డైమండ్ కొట్టేశారన్నారన్నారు. అది అబద్దం అని తేలింది. ఒకే సామాజికవర్గానికి పదోన్నతి ఇచ్చారన్నారు. అదీ పచ్చి అబద్దం అని తేలింది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అన్నారు. అదంతా ట్రాష్ అని కోర్టే చెప్పింది. ఫైబర్ గ్రిడ్‌లో స్కాం జరిగింది, నారా లోకేష్ పాత్ర ఉందంటూ నానా యాగీ చేశారు.
స్వయంగా నారా లోకేషే సవాల్ చేసినా సరే.. ఇప్పటి వరకు ఏమీ తేల్చలేకపోయారు. ఇలా టీడీపీపై జగన్ చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం కాదని తేలిపోయింది. జగన్ నోటి నుంచి వచ్చిన ఆరోపణలన్నీ బూటకపు మాటలు, పచ్చి అబద్దాలని తేలిపోయాయి. పెగాసస్‌పై చేస్తున్న రచ్చ కూడా అలాంటిదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాష్ట్రంలో ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉందీ అంటే.. అవి జంగారెడ్డిగూడెంలో మరణాలే. పాతిక మంది ఒకేరకమైన ఇబ్బందితో చనిపోయారని నెత్తీనోరు కొట్టుకుని మొత్తుకుంటున్నా జగన్ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. కల్తీసారా మరణాలేనని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా చెబుతున్నా వినిపించుకునే స్థితిలో లేదు. ప్రజల ప్రాణాలు పోతుంటే.. ఆ సమస్య కంటే పెగాసస్ ఎక్కువైందా?
ఇది డైవర్షన్ పాలిటిక్స్ కావా? గత ప్రభుత్వం నిజంగా పెగాసస్ కొని ఉంటే.. ఆ చెల్లింపుల వివరాలన్నీ ప్రభుత్వం వద్దే ఉంటాయి. ప్రభుత్వం చేసే ప్రతి చెల్లింపునకు బిల్లులు ఉంటాయి. జగన్ ఒక్క చిటికేస్తే డిటైల్స్ మొత్తం వచ్చిపడతాయి. మరి ఇప్పటి వరకు అలాంటివి వివరాలు జగన్ ఎందుకు బయటపెట్టలేదు? పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్‌వేర్ ఇజ్రాయెల్ రూపొందించింది.
ప్రపంచ కుబేరుడు వచ్చి అడిగినా సరే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మదు. కేవలం ప్రభుత్వాలతోనే డీల్ చేస్తుంది. అంటే ఏదీ రహస్యంగా జరగదు. రహస్య లావాదేవీలు జరిగే అవకాశమే లేదు. నిజంగా గత ప్రభుత్వానికే అమ్మి ఉంటే ఆ ఆధారాలేవీ? పోనీ.. ఏ ఒక్కరైనా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని కంప్లైంట్ చేశారా? పెగాసస్ అనే పదమే తెలియని రోజుల్లో వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని కోర్టుకెళ్లారు.
జగన్ అధికారంలోకి రాగానే.. తూచ్ అదేం జరగలేదంటూ కోర్టులో వేసిన కేసులను వెనక్కి తీసుకున్నారు. సజ్జల అయితే కనీసం హియరింగ్‌కు కూడా వెళ్లకపోవడంతో కేసు కొట్టేశారు. గత టీడీపీ ప్రభుత్వాన్ని కావాలని బద్నాం చేయడం కాకపోతే ఏంటిదంతా. ఒక రాష్ట్ర డీజీపీని ఎలా ఉపయోగించుకోకూడదో అన్ని రకాలుగా వాడారనేది ప్రతిపక్షాల ఆరోపణ.
ముఖ్యంగా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను టీడీపీపై కక్షసాధింపుకే ఉపయోగించుకున్నారని ఆ పార్టీ చెబుతూ వచ్చింది. ఆ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం పెగాసస్, గిగాసస్‌లాంటివేం లేవు.. అలాంటివి కొననే లేదు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. 2021 ఆగస్ట్ 12న గౌతమ్ సవాంగ్ సమాధానం ఇచ్చారు. పోనీ.. మాజీ డీజీపీకి కూడా తెలియదనుకుందాం. పెగాసస్ ఇష్యూపై తామే తేల్చుతాం అంటూ సుప్రీంకోర్టు చెప్పింది.
రాష్ట్రాలు విడిగా విచారణ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు ఈ హౌస్ కమిటీ ఏంటి? సాధారణంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే హౌస్ కమిటీ వేస్తారు. కాని, ఇక్కడ మాత్రం జగన్ ప్రభుత్వమే కమిటీ వేసింది. ఏం.. ఆమాత్రం దూకుడు జంగారెడ్డిగూడెం మరణాలపై వేయలేదేం? అన్నమయ్య కట్ట తెగి పదుల సంఖ్యలో జనం చనిపోవడానికి జగన్ ప్రభుత్వ అలసత్వం, అలక్ష్యమే కారణమని కేంద్రం చెప్పినప్పుడు హౌస్ కమిటీ వేయలేదేం?
ఇదే ప్రశ్నలను విపక్షాలు సంధిస్తున్నాయి.. జగన్ సీఎంగా సీట్లో కూర్చొని మూడేళ్లవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజుకో ఆరోపణ చేశారు. ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేకపోయారు. అసలు కోడి కత్తి కేసు ఏమైంది? స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కాం జరిగిందన్నారు.. ఇప్పటి వరకు ఏం తేల్చారు? పోలవరం టీడీపీకి ఏటీఎం అన్నారు..
మరి ఏ అవినీతిని వెలికితీయగలిగారు? ఆనాడు జగన్ చేసిన ఆరోపణల్లో ఏ ఒక్క దాన్లోనూ నిజం లేదు. కనుకే ఒక్క అవినీతి ఆరోపణను రుజువు చేయలేకపోయారని విపక్షాలంటున్నాయి. ఇప్పుడు పెగాసస్ కూడా అంతే. కేవలం జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగకుండా ఉండేందుకే పెగాసస్‌ను వాడుకుంటోందని మండిపడుతున్నారు..
రాష్ట్రంలో పిచ్చి బ్రాండ్లపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉద్యమం చేస్తుంటే.. ఆ ఇష్యూ జనాల్లోకి వెళ్లకుండా పెగాసస్‌ను హైలెట్ చేస్తోందనేది ఆరోపణ. ఏపీలో జే-బ్రాండ్ మద్యం అమ్ముతున్నారంటూ పోరు నడుపుతుంటే.. అవి జనాల్లోకి వెళ్లకూడదన్న దురుద్దేశంతోనే పెగాసస్‌పై చర్చ, హౌస్ కమిటీ అంటూ ఎత్తుగడ వేస్తోంది. రేప్పొద్దున పెగాసస్ స్పైవేర్ కొనుగోలే జరగలేదని రిపోర్ట్ వస్తే.. ఈ జగన్ ప్రభుత్వం ఎంత అభాసుపాలవుతుందో రాష్ట్ర ప్రజలే చూడబోతున్నారంటున్నారు టీడీపీ ధైర్యంగా చెబుతోంది.