Narayana Arrest : కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు నారాయణను హాజరుపరచనున్న పోలీసులు
Narayana Arrest : మాజీ మంత్రి నారాయణను కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు చిత్తూరు పోలీసులు హాజరుపరిచే అవకాశం ఉంది.;
Narayana Arrest : మాజీ మంత్రి నారాయణను కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు చిత్తూరు పోలీసులు హాజరుపరిచే అవకాశం ఉంది. వైద్యపరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉదయం పదకొండున్నరకు నారాయణను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఏపీలో 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, మాల్‌ప్రాక్టీస్ కేసులో చిత్తూరు DEO ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు ధృవీకరించారు.
ఏపీ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య నారాయణను అరెస్ట్ చేశారు. అయితే దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు అందింది. సరిహద్దు దాటుతున్న సమయంలోనే కారును తెలంగాణ పోలీసులు ఆపేశారు. నారాయణను కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదు అందిందని.. ఏపీ పోలీసులకు తెలిపారు. ఆ తరువాత ఎంక్వైరీ చేసి, డిటైల్స్ తెలుసుకుని నారాయణను తీసుకెళ్లేందుకు చిత్తూరు పోలీసులకు అనుమతి ఇచ్చారు.
వాస్తవానికి ఇవాళ నారాయణ తనయుడు మృతి చెందిన రోజు. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన స్వస్థలం నెల్లూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే ఏపీ పోలీసులు వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి నారాయణ భార్యను అదుపులోకి తీసుకోలేదని వెల్లడించారు పోలీసులు.
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీక్, మాల్‌ప్రాక్టీస్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో 60 మందికిపైగా అధ్యాపకులు, సిబ్బందిపై కేసులు పెట్టారు. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లా నారాయణ స్కూల్ నుంచి ఓ ఎగ్జామ్ పేపర్ లీకైనట్టు గుర్తించి.. ఆ స్కూల్ వైస్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.