ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం మరోసారి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్), లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) తీసుకురానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఏపీ మంత్రి వర్గం ఆమోదముద్ర వేయనుంది. కేబినెట్ ఆమోదం తెలపగానే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న నగర, పట్టణ ప్రజలకు ఆయా పథకాల ద్వారా వివిధ నిర్మాణాలు, లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకొనే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలు తీసుకొచ్చి సమర్థంగా అమలు చేశారు. అప్పటి దరఖాస్తుల్లో బీపీఎస్కు సంబంధించి 90%, ఎల్ఆర్ఎస్లో 65% వరకు పరిష్కారమయ్యాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుమతులు తీసుకోని భవన నిర్మాణాలు, లేఅవుట్లు భారీగా వెలిశాయి. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో 123 పుర, నగరపాలక సంస్థల్లో 30,065 ఇళ్లు, భవనాలకు ఆస్తిపన్ను విధించలేదని తేలింది. దీంతోపాటు అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్ల సంఖ్య 20 వేలకు పైగా ఉంటుందని అంచనా.