AP: స్కూళ్లకు సెలవులు..విమానాలు, రైళ్లు రద్దు
67 రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ.. విమానాలను రద్దు చేసిన సంస్థలు.. బయటకు రావద్దని సర్కార్ వార్నింగ్
మొథా తుఫాను ఆంధ్రప్రదేశ్లో తీరం దాటేందుకు దూసుకొస్తోంది. నేడు తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్టణం, భీమవరం తదితర మార్గాల్లో ప్రయాణించాల్సిన 67 రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. అక్టోబర్ 28, 29 తేదీల్లో ఈ రైళ్ల సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. వాతావరణం మెరుగైన తర్వాత భద్రతా ప్రమాణాలు బట్టి రైలు సేవలు తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ తుఫాను కారణంగా ఒడిశా, ఆంధ్ర కారిడార్లో పలు రైలు సేవలు రద్దయ్యాయి. అలాగే విమాన సేవలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. సోమవారం నాడు విశాఖపట్టణానికి వెళ్లాల్సిన అన్ని ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధితో పాటు.. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కూడా పలు రైలు సర్వీసులను మూడు రోజుల పాటు రద్దు చేసింది.. ఇక, మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన విమానయాన శాఖ.. మొంథా తుఫాను నేపథ్యంలో నేడు పలు విమానాలు విజయవాడ నుంచి రద్దు చేసినట్టు ప్రకటించారు. మొత్తంగా మొంథా తఫాన్ నేపథ్యంలో.. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన.. విజయవాడకు రావాల్సిన విమాన సర్వీసులను అన్ని రద్దు చేసినట్టు .ఎయిరిండియా ప్రకటించింది.
సురక్షిత ప్రాంతాలకు..
తుఫాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారందర్నీ సురక్షిత ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కోనసీమ, విశాఖపట్టణం జిల్లాల్లోని చాలా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగాయి. అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేయడంతోపాటు నీరు, విద్యుత్ సప్లయ్ దెబ్బతినకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తుఫాను సద్దుమణిగే వరకూ భద్రత అడ్వయిజరీని పాటించాలని సూచించింది. మరోవైపు తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో 2,194 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. కోనసీమ ప్రాంతంలో ఇప్పటికే ఈ శిబిరాలకు తరలింపు మొదలైంది. అన్ని జిల్లాలోని కలెక్టరేట్లలోనూ, కంట్రోల్రూంలు ఏర్పాటు చేశారు.