AP: దశాబ్దాలుగా రాయచోటిలోనే ఉగ్రవాదులు
పట్టుకోకపోతే పెను విధ్వంసమే జరిగేదన్న పోలీసులు... 30 ఏళ్లుగా దుస్తులు అమ్ముతూ ఉగ్ర దాడులకు ప్లాన్;
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రమూకల కదలికలను గుర్తించిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత నిందితుల ఇళ్లలో తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నివాసాల్లో భారీ పేలుళ్లకు ఉపయోగించే..పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, వాకీటాకీలు, పేలుడుకు వాడే వైర్లు లభ్యమైనట్లు తెలుస్తుంది. పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరు అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీగా తమిళనాడు పోలీసులు గుర్తించారు. అయితే వీరు తమిళనాడులో మారు పేర్లతో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ అబూబకర్ సిద్దిక్ తన పేరును అలియాస్ నాగూర్గా, మహమ్మద్ అలీ తన పేరును మేళపలయంగా చెప్పుకొని తిరుగుతున్నట్టు పోలీసులు పసిగట్టారు. రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో నివసిస్తూ చీరల వ్యాపారంతో పాటు చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నారు. అబూబకర్ను స్థానికులు "కేరళ కుట్టి"గా పిలిచేవారు. వీరిపై 1995 పార్సిల్ బాంబు కేసు, 1999లో తమిళనాడు మరియు కేరళలో జరిగిన సీరియల్ బాంబు దాడులు, 2011 మదురైలో బీజేపీ నాయకుడు ఎల్.కె. అద్వానీ రథయాత్రపై బాంబు దాడి ప్రణాళిక, 2013 మల్లేశ్వరం బీజేపీ కార్యాలయ బాంబు దాడి, 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య కేసులు ఉన్నాయి. తమిళనాడు ఏటీఎస్ వారి భార్యలను అరెస్టు చేశారు. వారి ఇళ్లల్లో జరిగిన సోదాల్లో భారీగా పేలుడు పదార్థాలు తయారు చేసే వస్తువులు పట్టుబడ్డాయి.
మారువేషాల్లో పట్టుకున్న అధికారులు
ఇద్దరు ఉగ్రవాదులు రాయచోటిలో ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో చెన్నై ఐబీ అధికారులు ఈ ప్రాంతంలో మకాం వేశారు. రెండు నెలలుగా మారువేషాల్లో తిరుగుతూ అనుమానితులపై నిఘా పెట్టారు. రాయచోటి కొత్తపల్లి ప్రాంతంలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న వీరి కార్యకలాపాలను నిశితంగా గమనించారు. సోమవారం రాత్రి ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకుని రహస్యంగా తీసుకెళ్లారు. నివాసంలో తనిఖీలు నిర్వహించగా ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, మందుగుండు సామగ్రి లభ్యమైనట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వీరిపై రూ.కోట్లలోనే రివార్డులు ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక విషయాలను వెల్లడించారు. నిందితులిద్దరూ 'అల్ ఉమ్మా' ఉగ్రవాదులని తెలిపారు. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు అలూమా అనేది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అని.. ఐసిస్, అలూమా సంస్థలు ఒకే విధమైన ఆలోచనలతో పనిచేస్తాయని ఆయన అన్నారు.