AP: చెప్పింది చెప్పినట్టు చేసేది కూటమి ప్రభుత్వమే
ఏపీలో ఆటోడ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేలు జమ.. ఆటోలో సభకు చంద్రబాబు, పవన్, లోకేశ్
చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం తమదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. లబ్ధిదారులకు రూ.436 కోట్లను అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. "అందరూ OG సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు.. విజయవాడ ఉత్సవ్ తో నగరానికి కొత్త కళ వచ్చింది.. నేరుగా లబ్ధిదారులకు డబ్బులు జమ అయ్యాయి.. ఆటో డ్రైవర్లకు అనేక కష్టాలు ఉన్నాయి.. గతంలో రోడ్లు గతుకులతో ఆటోలు, డ్రైవర్ల ఒళ్లు హూనం అయ్యేది అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ మరింత పెరగాలి.. గత ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటు తో గెలిచారు.. నాలుగోసారి గెలిచిన నాకు కూడా ఏం చేయాలో మొదట్లో అర్థం కాలేదు.. స్త్రీ శక్తి పథకంతో మహిళలు ఎక్కడకి అంటే అక్కడి వెళ్ళగలుతున్నారు.. దసరా సమయంలో అమ్మవారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మహిళలు ఇంద్రకీలాద్రికి వచ్చారు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆటో డ్రైవర్లలో చాలా మంది పేద వాళ్లే ఉంటారని... ఏడాదికి రూ. 15 వేలు ఇస్తే.. వారికి కొంత ఊరటగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లన్నీ గతుకులే గతుకులన్న చంద్రబాబు.. మన ప్రభుత్వంలో ఎప్పుడూ ఆ పరిస్థితి రానివ్వబోమని హామీ ఇచ్చారు.
ఆటో డ్రైవర్లకు మరో శుభవార్త
ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం ఒక యాప్ తయారు చేసి బుకింగ్ లు వచ్చేలా చేస్తామని తెలిపారు. ఆటో స్టాండుకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తామన చెప్పారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల భవిష్యత్తు కోసం పని చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా అవకాశాలు దొరికేలా చేస్తామని, ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలో 90 శాతం వాహనాలు సీఎన్జీ ఇంధనంతోనే నడుస్తున్నాయన్నారు. గతంలో పెద్ద ఎత్తున జరిమానాలు విధించేవారని, జరిమానాలు భారం కాకుండా చూస్తామన్నారు. ఆటో, మాక్సి, క్యాబ్ డ్రైవర్లు క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. "సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం సాగుతోంది. జీఎస్టీ సంస్కరణలతో సూపర్ సేవింగ్స్. దసరా, దీపావళి, సూపర్ సిక్స్, సూపర్ జీఎస్టీ. గత ఐదేళ్ల విధ్వంసం నా జీవితంలో చూడలేదు. దుర్మార్గులు రాజకీయాల్లో ఉంటే అభివృద్ధి శూన్యం. దుష్ట శక్తులు రాకుండా ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రూ. 15 వేలతో ఏం చేసుకోవాలి'
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పండగే పండగ అని డైలాగులు కొడుతున్నారని తెలిపారు. రూ.15వేలతో ఏం పండుగ చేసుకోవాలని ప్రశ్నించారు. అసలు ఈ పథకాన్ని ప్రారంభించినదే వైఎస్ జగన్ అని గుర్తుచేశారు. జగన్ ప్రారంభించిన పథకాన్నే కూటమి ప్రభుత్వం మరో పేరుతో అమలు చేస్తోందని పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు.