AP: టిడ్కో హౌసింగ్ మోసాలు
ఏపీ సర్కార్ టిడ్కో హౌసింగ్ మోసాలు మామాలుగా లేవు.అసలు నిర్మించని ఇంటికి కూడా నోటీసులు జారీ చేసేస్తున్నారు.;
ఏపీ సర్కార్ టిడ్కో హౌసింగ్ మోసాలు మామాలుగా లేవు.అసలు నిర్మించని ఇంటికి కూడా నోటీసులు జారీ చేసేస్తున్నారు. అదే టీడీపీ సానుభూతి పరులైతే వేధింపులు ఓ రేంజ్ లో ఉంటున్నాయి.కృష్ణా జిల్లాలో తెడీపీ సానుభూతిపరులపై సచివాలయ స్థాయిలోనే నోటీసులు జారీ అవుతున్నాయని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.టీడీపీ హయాంలో టిడ్కో ఇంటికి దరఖాస్తు చేసుకున్న వారికి గత ప్రభుత్వం జక్కంపూడిలో నిర్మిస్తున్న టిడ్కో కాలనీలో ఫ్లాట్‌లు కేటాయించింది. అయితే లబ్ధిదారుని వాటాగా 50 వేలు చెల్లించారు. అయితే వైసీపీ సర్కార్ వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ఆపేసింది.ఇళ్ల నిర్మాణం పూర్తికాకముందే ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాల కోసం మార్ట్‌గేజ్ తతంగాన్ని పూర్తి చేసింది. ఆ నేపధ్యంలోనే వారి ఫ్లాట్‌లకు సంబంధించి రిజిస్ట్రేషన్, బ్యాంకు తనఖా రిజిస్ట్రేషన్ అయ్యాయి. కానీ ఇంటి నిర్మాణం పూర్తికాలేదు. ఇంతలో ఎస్‌బీఐ నుంచి వారికి ఓ నోటీసు అందింది.ఇంటి లోన్ సరిగ్గా చెల్లించడం లేదనీ..నెలవారీ ఈఎంఐ తో పాటు పాత బకాయిలంటూ వేలల్లో చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. వీరంతా టీడీపీ సానుభూతి పరులు కావడంతోనే కావాలనే ఇలా ఇంటిని అప్పగించకుండానే వేలల్లో బకాయిలు ఉన్నట్లు చూపిస్తున్నారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.టిడ్కో లబ్ధిదారులకి ఇళ్లను అప్పగించకుండానే రుణాలు చెల్లించాలని నోటీసులు జారీ అవుతున్నాయి.టీడీపీ సానుభూతిపరులపై ఇలా వేధింపులకు దిగుతున్నారని మండిపడుతున్నారు.
ఓ వైపు లబ్ధిదారులకు నోటీసులు జారీ అవుతుండగా..మరోవైపు కాంట్రాక్ట్ సంస్థలు టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ఆపేశాయి.ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ, మచిలీపట్నం మినహా మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు ఆగాయి. తమకు బిల్లులు ఇచ్చే వరకు పనులు చేయమని తేల్చేశాయి.దేశంలోనే టాప్ కంపెనీ ఎల్‌అండ్‌టీ కూడా నిర్మాణం పూర్తిగా ఆపేసింది.విజయవాడలో ఎన్‌సీసీ సంస్థ నిర్మాణం చేపట్టగా గుడివాడ, మచిలీపట్నంలో కేఎంవీ సంస్థ చేపట్టింది. అయితే కేఎంవీ మాత్రమే పనులు కొనసాగిస్తోంది. ఎల్‌అండ్‌టీకి దాదాపు 90 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఎన్‌సీసీ సంస్థ కూడా నత్తనడకన పనులు చేస్తోంది.వచ్చే దసరా నాటికి జిల్లాలో అన్ని టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాలన్న సర్కార్ హామీ నెరవేరేలా లేదని అధికారులు అంటున్నారు.
మరోవైపు విజయవాడ పరిధిలో 6,576 గృహాలను నిర్మిస్తున్నారు. వీటిలో రెండువేల ఇళ్లను దసరా నాటికి ఇవ్వాలని జగన్ సర్కార్ లక్ష్యం. అయితే రుణాలు మంజూరు కాక.. డాక్యుమెంటేషన్ పూర్తి చేయక ఇళ్ల నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయి. రాజధాని గ్రామాల్లో 27వేల మందికి ఇచ్చిన స్థలాలపై చూపుతున్న శ్రద్ధను టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి.విజయవాడ పరిధిలో దాదాపు 60 వేల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 25 శాతం లోపు నిర్మాణాలను జగన్ సర్కార్ రద్దు చేసింది. దీంతో భారీగా లబ్ధిదారులు మిగిలిపోయారు. వారు కట్టిన సొమ్ము వాపసు ఇవ్వాలి. కానీ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. టీడీపీ సానుభూతిపరులు ఉన్న జాబితాపై వైసీపీ ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు సమాచారం. అయితే బిల్లులు పెండింగ్‌లో ఉండటంతోనే నిర్మాణాలు నిలిచిపోయాయని టిడ్కో అధికారులు చెబుతున్నారు.