AP: రాజధాని రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆరు నెలల్లో పరిష్కరిస్తామన్న కేంద్రమంత్రి పెమ్మసాని
అమరావతి రాజధాని రైతుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర మంత్రి నారాయణ, తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్, అడిషనల్ కమిషనర్, రైతు జేఏసీ ప్రతినిధులతో కలిసి నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వ కారణంగా డెవలప్మెంట్ పనులు నిలిచిపోయాయి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందన్నారు. అయితే భూవివాదాల కారణంగా పనుల్లో జాప్యం ఏర్పడుతుందన్నారు. కొందరు తమవి కాని భూములను తమవిగా పేర్కొంటూ సమస్యలకు కారణమవుతున్నారన్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
అభివృద్ధికి 25 గ్రామాలు...
రాజధాని అమరావతి పరిధిలో 25 గ్రామాలను డెవలప్ చేసేందుకు ఐదు సంస్థలకు కాంట్రాక్టును ఇవ్వనున్నామన్నారు. ఆయా గ్రామాల్లో నీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి పైపులైన్లు, రోడ్లు, శానిటేషన్, వీధి దీపాల వంటి ఆధారంగా జరిపే డీపీఆర్ సమర్పించాలని ఆయా సంస్థలను ఆదేశించామన్నారు. డిసెంబర్ 15 నుంచి 30 లోపు ఫైనల్ డీపీఆర్ రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పనులు ప్రారంభమవుతాయన్నారు. జూన్ నాటికి ఆరు నెలల్లో నిర్దేశిత పనులు పూర్తవుతాయని చెప్పుకొచ్చారు. ఎన్సీసీ సంస్థకు 4, ఆర్వీఆర్ కు 3, మేఘాకు 13, బీఎస్ఆర్ కు 5, ఎల్ అండ్ టీకి 5 గ్రామాలను కేటాయించడం జరిగిందని వెల్లడించారు.