AP: వచ్చే ఏడాది నుంచే ‘కలలకు రెక్కలు’ పథకం అమలు
ఆత్మహత్యలపై నారా లోకేశ్ ఆందోళన
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలుచేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో కళాశాల విద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్యాశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ శుక్రవారం 3గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం కింద సాయం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో విద్యనభసిస్తున్నారని, స్వదేశంలో 88,196మంది ఉన్నత చదువులు చదువుతున్నట్లు అధికారులు చెప్పారు. విదేశీ విద్య పథకం ఏవిధంగా అమలు చేయాలన్న విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఆత్మహత్యలపై ఆందోళన
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి లోకేష్ ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ మార్గాలను సూచించేందుకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉమ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలల్లో సౌకర్యాల మెరుగు, విద్యార్థులపై వత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. అనుమతులు లేకుండా నడిచే ప్రైవేటు కళాశాలలపై చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి ఐఐటి, ఎన్ ఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల సీట్లు సాధించేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పెర్ఫార్మెన్స్ పై దృష్టిసారించాలని సూచించారు.