AP: సమాన వేతనాలు ఇవ్వండి

విజయవాడలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల మహాసభ.. అండగా ఉంటామన్న ఉద్యోగ సంఘ నేతలు

Update: 2023-12-11 01:00 GMT

 రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జగన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పొరుగు సేవల సిబ్బందికి మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చేయాలని ఉద్యోగ సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఉద్యోగ సంఘాలు అండగా ఉంటాయన్నారు. ఆ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని కోరుతూ విజయవాడ జింఖానా మైదానంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రథమ మహాసభను నిర్వహించారు.

ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజుతోపాటు ఏపీజేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్‌ దామోదర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ సంఘ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనాలు ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్‌ చేశారు. పొరుగు సేవల సిబ్బందికి మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చేయాలన్నారు. వారికి సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం కోత విధించడం సరికాదన్నారు. ఆర్టీసీ, ఇరిగేషన్‌, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం ఆప్కాస్‌ పరిధిలోకి తీసుకోవాలని APJAC ఉద్యోగుల సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. వాళ్లకు H.R పాలసీ అమలు చేయాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును 62 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది ఐక్యత కోసమే మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను శ్రమ దోపిడి చేస్తున్నారని సిబ‌్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కూడా సెలవు లేదని వాపోయారు. సమస్యల గురించి ప్రస్తావిస్తే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని భయబ్రాంతులకు గురవుతున్నామని తమ గోడును వెల్లబోసుకున్నారు. చాలిచాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెడికల్ లీవులు ఇవ్వాలని, చనిపోయిన సిబ్బంది కుటుంబానికి ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వేతనాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ జింఖానా మైదానంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మహాసభ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సభలో పాల్గొన్న APJAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాతికేళ్ల క్రితం చేరిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంత వేతనం ఉందో ఇప్పుడు చేరిన వారికి అంతే ఉందని తెలిపారు. ప్రతి నెలా ఇంక్రిమెంట్ పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News