APPSC: నేడు గ్రూప్-2 పరీక్ష యథాతథం
ఉదయం 10 గంటల నుంచి పరీక్ష ఆరంభం.. 15 నిమిషాలు ముందే రావాలన్న ఏపీపీఎస్సీ;
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నేడు యథాతథంగా జరగనుంది. కూటమి ప్రభుత్వం రాసిన లేఖపై ఏపీపీఎస్సీ స్పందించింది. పరీక్ష వాయిదా వేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి గ్రూప్ 2 వాయిదా వేయాలని ప్రభుత్వం సూచనను ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. అనుకున్నట్టుగానే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకే ఏపీపీఎస్సీ మొగ్గు చూపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పట్టభద్రులకు ప్రయోజనం చేసే నిర్ణయాన్ని అమలు చేయలేమంటూ స్పష్టం చేసింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయలేమని వెల్లడించింది. రేపటి పరీక్ష యథాతథంగా ఉంటుందని.. అభ్యర్థులు హాజరుకావాలని తెలిపింది. వాయిదా ప్రచారాన్ని ఖండిస్తూ పరీక్ష ఉంటుందని ఆలస్యంగా ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 జరుగుతుందని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని కమిషన్ సూచించింది.
పోలీసులకు ఏపీపీఎస్సీ ఫిర్యాదు
గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసినట్టు కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీపీఎస్సీ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయలేదని స్పష్టం చేసిన ఏపీపీఎస్సీ.. రేపటి పరీక్ష యథాతథంగా ఉంటుందని.. అభ్యర్థులు హాజరుకావాలని తెలిపింది. పరీక్షలు వాయిదా పడ్డాయన్న ప్రచారంపై ఏపీపీఎస్సీ అధికారికంగా స్పందించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏ పరిస్థితుల్లోనూ పరీక్షను వాయిదా వేయబోమని స్పష్టం చేసింది. ప్లాన్ చేసినట్లుగానే పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎటువంటి అపోహలకు గురికావొద్దని తెలిపింది.
రోడ్డెక్కిన గ్రూప్-2 అభ్యర్థులు
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష వాయిదా వేయాలని స్వయానా ప్రభుత్వం లేఖ రాసినా ఏపీపీఎస్సీ వినకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నాకు దిగారు.
గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్ష సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.