APPSC: ఏపీపీఎస్సీ సంస్కరణలో కీలక అడుగు

ఇక పరీక్షలన్నీ ఆఫ్‌లైన్ విధానంలోనే... ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ;

Update: 2024-12-27 03:00 GMT

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కీలక సంస్కరణల దిశగా తొలి అడుగు పడింది. ప్రభుత్వ శాఖల్లోని 272 రకాల పోస్టులను నాన్‌ టెక్నికల్, టెక్నికల్‌ సర్వీసెస్‌ కేటగిరీలుగా విభజించి, నియామకాలు చేపట్టాలని ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. నియామక పరీక్షలు అన్నింటినీ ఇక ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించాలని సూచించింది. నాన్‌-టెక్నికల్‌ విభాగంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, సర్వీసెస్‌ను చేర్చింది. టెక్నికల్‌ సర్వీసెస్‌లో ఏ, బీ, సీ కేటగిరీల కింద ఇంజినీరింగ్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఉంచాలని సూచించింది. ఏపీ టీచింగ్‌ సర్వీసెస్‌లో ఏ, బీ కేటగిరీల వారీగా, ఏపీ టెక్నికల్‌ సర్వీసెస్‌లో ఇతర పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది.

ప్రభుత్వానికి నివేదిక

ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామకాలు, పరీక్షా విధానం, ప్రతిపాదనల్లో ఉన్న పోస్టుల రీ-గ్రూపింగ్, ఇతర అంశాలపై ఈ ప్రత్యేక కమిటీ అధ్యయనం చేసింది. యూపీఎస్సీ, రాజస్థాన్, కేరళ, బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయాలను సందర్శించి, అక్కడి కార్యకలాపాల తీరును సమీక్షించింది. వీటిని ఏపీపీఎస్సీ కార్యకలాపాలతో సమన్వయం చేస్తూ... తీసుకురావాల్సిన సంస్కరణలపై రూపొందించిన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వశాఖల్లో పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారానే జరగాలని పేర్కొంది. ప్రస్తుతం కొన్ని శాఖలు వాటికవే నియమించుకుంటున్నాయని అలా జరగకుండా చూడాలని స్పష్టం చేసింది.

సెప్టెంబరు 1 నుంచి ప్యానల్‌ ఇయర్‌

ప్రతి ఏడాది ‘ప్యానల్‌ ఇయర్‌’ను సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని కమిటీ సూచించింిద. ఆగస్టు 31నాటికి ప్రభుత్వ శాఖల యూనిట్‌ ఆఫీసర్లు ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలని తెలిపింది. మంజూరైన పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి అక్కర్లేదని వెల్లడించింది. జూన్‌ నుంచి కసరత్తు ప్రారంభించాలి. దీనికి అనుగుణంగా ఏపీపీఎస్సీ ‘జాబ్‌ క్యాలెండర్‌’ను ఖరారు చేయాలని... మరుసటి సంవత్సరం డిసెంబరులోగా నియామకాలు పూర్తి కావాలని తెలిపింది. కమిషన్‌ ఎంపికచేసే అభ్యర్థులకు మార్చిలోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపింది. ప్రస్తుత నియామకాల తీరు ఆందోళనకరంగా ఉందని... శాఖల నిర్లక్ష్యం వల్ల నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీ ఓ పద్ధతి ప్రకారం జరగట్లేదని వెల్లడించింది. కేరళ, రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, యూపీఎస్సీలో ఓ పద్ధతి ప్రకారం నోటిఫికేషన్ల జారీ, నియామకాలు జరుగుతున్నాయని తెలిపింది.

Tags:    

Similar News