ఏపీలో సంచలనం రేపిన కల్తీమద్యం కేసుపై విచారణ వేగంగా జరుగుతోంది. సిట్ అధికారులు ఇప్పటికే జోగి రమేశ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఇందులో చాలా మంది అరెస్ట్ అయ్యారు. వారందరినీ విచారిస్తుంటే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ కల్తీమద్యంను కేవలం ఏపీలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా అమ్మారు నిందితులు. ఏ-15గా బాలాజీ, ఏ 21గా సుదర్శన్ తో జనార్ధన్ రావుకు సత్సంబంధాలు ఉన్నాయి. జనార్థన్ రావు నుంచి కల్తీమద్యం తీసుకుని ఈ బాలాజీ, సుదర్శన్ పక్క రాష్ట్రాలకు తరలించి అమ్మేశారు. అక్కడ వచ్చిన సొమ్మును వైసీపీ పెద్ద నేతలకు పంపించినట్టు సమాచారం అందుతోంది.
ఏ 22గా కోయంబత్తూర్ కు చెందిన సింథిల్ ను చేర్చింది సిట్ బృందం. ఎందుకంటే ఈ సింథిల్ కల్తీమద్యం కలపడానికి ఖాళీ బాటిల్స్ ను సరఫరా చేశాడు. ఇదంతా పెద్ద మాఫియాలాగా విస్తరించారు. ప్రభుత్వ పెద్దల సపోర్టు లేకుండా ఇంత చేయడం అసాధ్యం. జోగి రమేశ్ తో పాటు మరికొందరు పెద్ద నేతల అండతోనే ఈ కల్తీ దందాను యథేచ్చగా నిర్వహించినట్టు విచారణలో తెలుస్తోంది. సుదర్శన్, బాలాజీలకు పూర్తిగా సపోర్ట్ చేసిన కొందరు వైసీపీ పెద్ద నేతలు కోట్ల రూపాయలను దండుకున్నట్టు సమాచారం. ఈ రోజు సిట్ అధికారులు మదనపల్లె కోర్టులో ఓ పిటిషన్ వేయనున్నారు. బాలాజీ, సుదర్శన్ ను విచారించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ ఇద్దరినీ విచారిస్తే చాలా కీలక విషయాలకు బయటకు వస్తాయని సిట్ భావిస్తోంది. ప్రస్తుతం బాలాజీ, సుదర్శన్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. త్వరలోనే వారిని కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇక ఈ కేసులో సురేంద్ర అనే పేరు కూడా కీలకంగా వినిపిస్తోంది. సురేంద్రను మొదట్లోనే విచారించింది సిట్. బాలాజీ, సుదర్శన్ తర్వాత మరోసారి సురేంద్రను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలాజీ, సుదర్శన్ నుంచి ఎవరెవరికి ఈ కల్తీమద్యం డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి, ఏమైనా ఆస్తులు బదలాయింపులు జరిగాయా అనే కోణంలో కూడా సిట్ విచారణ జరుపుతోంది. చూస్తుంటే త్వరలోనే మరింత మంది అరెస్టులు తప్పవని అంటున్నారు.