విశాఖలో నిత్య పెళ్లికొడుకు: ఆలస్యంగా బయటపడుతున్న అరుణ్‌కుమార్ అరాచకాలు..!
విశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరుణ్‌కుమార్ అరాచకాలు ఆలస్యంగా బయటపడ్డాయి. 8 మంది అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వలలో వేసుకుని పెళ్లి చేసుకుని.. వేధింపులకు పాల్పడుతున్నాడు.;
విశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరుణ్‌కుమార్ అరాచకాలు ఆలస్యంగా బయటపడ్డాయి. 8 మంది అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వలలో వేసుకుని పెళ్లి చేసుకుని.. వేధింపులకు పాల్పడుతున్నాడు. బాధిత మహిళలు విశాఖ సీపీకి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి... పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్మకం, వ్యభిచార ముఠాతోనూ అరుణ్ కుమార్‌కు సంబంధాలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. కొంతమంది మహిళల భర్తల్ని చంపి.. వారిని బెదిరించి లొంగదీసుకున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అరుణ్ కుమార్ ఆగడాలపై కంచెరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితలు ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేసిన విషయాన్ని పోలీసులే అరుణ్ కుమార్‌కు చేరవేసినట్టు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న అరుణ్ కుమార్... తమను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణ భయంతో మహిళలు ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అరుణ్ కుమార్ నేరాల్ని అణచివేయకుండా.. పోలీసులే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బాధిత మహిళలకు అరుణ్ కుమార్ చేతిలో ప్రాణహాని ఉందని.. వారికి ఏమైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. అటు కంచెరపాలెం పోలీసులపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును స్వయంగా పర్యవేక్షించాలని విశాఖ సీపీని ఆదేశించారు.