ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత 16వ శాసనసభకు సంబంధించి నాలుగో సెషన్‌ను 18న ఉదయం 9 గంటలకు ప్రారంభించేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో శాసనమండలి 48వ సెషన్ కూడా 18న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశాలను ఏడు లేదా పది పనిదినాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. వీటితో పాటు మరికొన్ని బిల్లులు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, ఆర్థిక పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది.