SLBC:ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం.. 8 మంది గల్లంతు

ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు... కార్మికులను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్న మంత్రి ఉత్తమ్;

Update: 2025-02-22 12:07 GMT

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎస్ఎల్‌బీసీ ఎడమవైపు సొరంగం పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. టన్నల్ బోర్ మెషిన్‌తో పని జరుగుతున్నప్పుడు సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో లోపల చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో గల్లంతయిన వారిలో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారన్న దానిపై ఎలాంటి స్పష్టత రాలేదని మంత్రి వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ పనులు మొదలు పెట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని ఉత్తమ్ తెలిపారు.

ఆర్మీతో మాట్లాడాం

ఎస్ఎల్బీసీ ప్రమాదంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కూలిన టన్నెల్ పూర్తిగా బ్లాక్ అయిపోయిందని మంత్రి తెలిపారు. టన్నెల్ కూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు గల్లంతయ్యారని వెల్లడించారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉత్తమ్ వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పిస్తున్నామని.. భారత సైన్యంతో కూడా మాట్లాడామని ఆయన తెలిపారు.

కేంద్రమంత్రి ఆరా

ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరాతీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

బీఆర్ఎస్ ఆగ్రహం

ఎస్ఎల్బీసీ ప్రమాదంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్ధతకు, చేతగానితనానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్ మండిపడ్డారు.

Tags:    

Similar News