Andhra Pradesh: అయ్యన్న అరెస్టును నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చిన టీడీపీ..
Andhra Pradesh: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది టీడీపీ అధిష్టానం.;
AndhraPradesh: నర్సీపట్నంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది టీడీపీ అధిష్టానం. సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు, జగన్ సర్కార్ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఇవాళ నర్సీపట్నం బంద్‌కు పిలుపునిచ్చారు.
బంద్‌లో భాగంగా టీడీపీ కార్యకర్తలు నర్సీపట్నంలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ధర్నా చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా సరే టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై నుంచి లెగకపోవడంతో పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.
ప్రస్తుతం సీఐడీ కార్యాలయంలో ఉన్న అయ్యన్నపాత్రుడిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే వెలగపూడి వెళ్లారు. అయితే, ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వెలగపూడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరామర్శించడానికి వచ్చిన వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు వెలగపూడి. అయినా.. తాను సీఐడీ కార్యాలయానికి చాలా దూరంగా ఉన్నానని, అరెస్ట్ చేయడం దారుణం అని మండిపడ్డారు.
అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ అరెస్ట్ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు.. వేకువజామునే భారీ ఎత్తున నర్సీపట్నం చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రోడ్లపై ర్యాలీగా వెళ్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడిని వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.
అయ్యన్న అరెస్టును మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు. సీఐడీ అధికారులు కక్షగట్టి మరీ వేధిస్తున్నారంటూ ఆరోపించారు. రాత్రి సమయంలో ఇంటి గోడ దూకి మరీ లోపలికి రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.