AP : రైతుల, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలు ఉండాలి - సీఎం చంద్రబాబు

Update: 2025-08-26 13:45 GMT

బ్యాంకుల నిర్ణయాలు రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో సగం సమయం గడిచిపోయిందని, ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీలు అందజేయాలని ఆయన సూచించారు. సీజన్ చివరిలో రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 231వ ఎస్‌ఎల్‌బీసీలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సీఎం సమీక్ష నిర్వహించారు. అలాగే 'వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్‌' కార్యక్రమానికి బ్యాంకుల సహకారం గురించి, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు అంశం గురించి చర్చించారు.

బ్యాంకర్లకు చంద్రబాబు సూచనలు

మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు తమ వైఖరిని మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. కేంద్రం జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ప్రజలను నియంత్రించకూడదని, తదుపరి సంస్కరణల దిశగా ప్రజలను ప్రోత్సహించాలని అన్నారు. అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాలు విసిరేలా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోందని ఆయన అన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలని, 2047 నాటికి భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కావని, పేదలు-ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. ఆర్థికశాస్త్రం చదివిన విద్యార్థిగా, ప్రజాప్రతినిధిగా తాను ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తానని చంద్రబాబు అన్నారు. దేశంలో సంపద సృష్టి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    

Similar News