DRUGS: ఆంధ్రప్రదేశ్ లో "ఐసిస్ డ్రగ్"
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో చేపట్టిన సోదాల్లో బహిర్గతం;
ఐసిస్, బొకోహరమ్ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే "ఐసిస్ డ్రగ్" ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూడడం తీవ్ర సంచలనం రేపింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని భార్గవ మెడికల్ స్టోర్స్‌లో ఐసిస్ డ్రగ్ గా పిలిచే ట్రెమడాల్ అనే సైకోట్రోపిక్ సబ్‌స్టెన్స్ ను అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు. 2022 నుంచి 2024 వరకు ఈ ఒక్క షాపులోనే 55,961 ట్రెమడాల్ మాత్రలు, 2,794 ఇంజెక్షన్లు విక్రయించారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో చేపట్టిన సోదాల్లో ఈ వ్యవహారం బహిర్గతమైంది.
అసలు ఏమిటీ ఐసిస్ డ్రగ్..?
అలసట, నిద్ర రాకుండా ఉండటానికి, ఎక్కువ సమయం ఉత్తేజంగా పనిచేయటానికి ఐసిస్, బోకోహరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు ఈ ట్రెమడాల్ మాత్రలను అందిస్తుంటాయి. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ డ్రగ్ అని... పైటర్ డ్రగ్ అని పిలుస్తారు. దీంతో ట్రెమడాల్ ఔషధం తయారీ, వినియోగంపై 2018 ఏప్రిల్‌లో కేంద్రం కఠిన ఆంక్షలు విధించింది. ఈ ఐసిస్ డ్రగ్ ను ఎన్‌డీపీఎస్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి సైకోట్రోపిక్ సబ్‌స్టెన్స్ అంటే మాదక ద్రవ్యంగా గుర్తించింది.
రూ. 13 లక్షల ఔషధాల విక్రయాలు
అవనిగడ్డ పరిసర ప్రాంతంలో అనేక వందల మంది ఈ మత్తు పదార్థానికి బానిసలుగా మార్చినట్లు ఈగల్ విభాగం గుర్తించింది. భార్గవ మెడికల్ స్టోర్ యజమాని కొనకళ్ల రామ్మోహన్ అక్రమంగా విక్రయిస్తున్న మందుల జాబితాను చూసి అధికారులే నిర్ఘాంతపోయారు. గత రెండేళ్లలో రూ.13 లక్షల విలువైన ఔషధాలను అవనిగడ్డలోని మెడికల్ దుకాణదారే విక్రయించినట్టు లెక్కలు తేల్చారు. యజమానిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.