BJP: బీజేపీకి తొలి మహిళా అధ్యక్షురాలు
తుది దశకు బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక, 16 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం పూర్తి... అధ్యక్ష ఎన్నికకు ముందు 19 రాష్ట్రాల్లో ప్రక్రియ;
భారతీయ జనతా పార్టీలో జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరింది. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో ఇప్పటికే కొత్త పార్టీ అధ్యక్షుల నియామకం పూర్తవ్వగా, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 19 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు నియమితులైన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అయితే ఈసారి బీజేపీ గట్టి సిగ్నల్ ఇవ్వనుందన్న రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఆ పదవి ఒక మహిళా నేతకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఊహాగానాలు జోరందుకుంటున్నాయి.
మహిళా నేతల పేర్లు హాట్ ఫేవరెట్‌గా!
బీజేపీ నేతృత్వం ఈసారి మహిళలకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, దగ్గుబాటి పురందేశ్వరి, మహిళా మోర్చా చీఫ్ వానతీ శ్రీనివాసన్ ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్ పేరే ప్రస్తుతం అధిష్ఠానం లోనూ, పార్టీ వర్గాల్లోనూ ప్రాధాన్యతగా వినిపిస్తోంది. 2019 నుండి ఆర్థిక మంత్రి హోదాలో దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తున్నారు. మోదీ కేబినెట్‌లో నెంబర్ వన్ మహిళా నాయకురాలిగా, అంతర్జాతీయ వేదికలపై తన ఆధిపత్యాన్ని చాటారు. ఇటీవల నడ్డా, బీఎల్ సంతోష్‌లను ఆమె భేటీ అయిన వార్తలు ఈ ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయి.
పురందేశ్వరి
ఏపీ బీజేపీలో పునాదులను బలోపేతం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి, ఇప్పుడు జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని చూపే ప్రయత్నాల్లో ఉన్నారు. విదేశీ పర్యటనలు, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని చాటి చెప్పడం వంటి అంశాలు ఆమెకు డిప్లొమాటిక్ ఫ్లెవర్‌ను కలిగించాయి. కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చినప్పటికీ, బీజేపీలో పూర్తిగా కలిసిపోయారు. కేంద్రం ఏర్పాటుచేసిన 7 అఖిలపక్ష బృందాల్లోని ఓ బృందానికి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహించారు. ఫ్రాన్స్, యూకే, ఈయూ, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ దేశాల్లో పర్యటించిన ఆమె బృందం ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది.
వానతీ శ్రీనివాసన్
వానతీ శ్రీనివాసన్ పేరులో కొత్తదనముంది. తమిళనాడులో బీజేపీ బలహీనంగా ఉన్నప్పటికీ, కోయంబత్తూర్ (దక్షిణ) నియోజకవర్గాన్ని MNM అధినేత కమల్ హాసన్‌పై గెలవడం పార్టీకి విశ్వాసాన్ని ఇచ్చింది. 2022లో కేంద్ర ఎన్నికల కమిటీలోకి చేర్చడం, మహిళా మోర్చా నాయకురాలిగా ఆమె నిర్వహించిన కార్యక్రమాలు ఆమెను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేశాయి.
రెండు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
మహిళా శక్తికి గౌరవం: బీజేపీ దశాబ్దాల చరిత్రలో ఇప్పటి వరకు మహిళా జాతీయ అధ్యక్షురాలు లేరు. మోదీ-షా జంట ఈసారి ఆ చరిత్రను మార్చే దిశగా అడుగులు వేయడం విశేషం. దక్షిణ భారత ప్రాధాన్యం: వానతీ, పురందేశ్వరి, నిర్మలమ్మ ముగ్గురూ దక్షిణాది రాష్ట్రాల నేతలే. భాజపా దక్షిణాదిలో పట్టు సాధించలేని నేపథ్యంలో, అక్కడివారికి అధిపత్యం ఇవ్వడం వ్యూహాత్మకంగా చూడవచ్చు.