BLOWOUT: ఇరుసుమండ బ్లూ అవుట్.. పూర్తిగా ఆరిపోయిన మంటలు

 శకలాలను పూర్తిగా తొలగించిన ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం

Update: 2026-01-10 09:00 GMT

కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద జరిగిన బ్లోఅవుట్‌ ఘటనకు ఎట్టకేలకు ముగింపు పలికింది. మోరి–5 డ్రిల్లింగ్ సైట్‌లోని బావిలో చెలరేగిన అగ్ని మంటలు పూర్తిగా ఆరిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం బావి పరిసరాల్లో ఉన్న శకలాలు, ధ్వంసమైన లోహ భాగాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. మంటలు ఆర్పివేత పూర్తైన తరువాత, బావి వద్ద ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు వాటర్ అంబ్రెల్లా విధానంలో శీతలీకరణ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భూమి లోతుల్లో ఉన్న వాయువుల ప్రభావం పూర్తిగా తగ్గేలా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, ఎటువంటి ప్రమాద పరిస్థితి లేదని అధికారులు వెల్లడించారు. 

తదుపరి దశగా బావికి వెల్ క్యాపింగ్ పనులు చేపట్టేందుకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతోంది. బావి వద్ద అమర్చేందుకు అవసరమైన బ్లోఅవుట్ ప్రివెంటర్‌ను ONGC ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ పరికరాన్ని అమర్చిన తరువాత భవిష్యత్తులో వాయు లీకేజీ లేదా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం పూర్తిగా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెల్ క్యాపింగ్ పూర్తైన తరువాత డ్రిల్లింగ్ సైట్‌ను పూర్తిస్థాయి భద్రతా తనిఖీలకు లోబరచనున్నారు.ఇరుసుమండలోని మోరి–5 డ్రిల్లింగ్ సైట్‌లో ఈ నెల నవంబర్ 5న మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లీకైన వాయువు ఒక్కసారిగా అంటుకోవడంతో భారీ శబ్దంతో అగ్ని మంటలు ఎగసిపడ్డాయి. సుమారు 20 మీటర్ల ఎత్తు వరకు మంటలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాలు భయానక పరిస్థితిని ఎదుర్కొన్నాయి. మంటల తీవ్రతను గమనించిన అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ప్రమాదం మరింత విస్తరించే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా ఇరుసుమండతో పాటు లక్కవరం తదితర సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలీస్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేసి ఖాళీ చేయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశంగా అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News