BORUGADDA: హైకోర్టుకే బోరుగడ్డ బురిడీ..!
నకిలీ సర్టిఫికెట్‌తో బెయిల్ పొందిన బోరుగడ్డ..!.. విచారణ మొదలుపెట్టిన పోలీసులు;
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తోపాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్... ఏకంగా హైకోర్టుకే టోకరా వేశాడు. తల్లి అనారోగ్యం కారణాలతో బోరుగడ్డకు గత నెల 15న బెయిల్ మంజూరైంది. రాజమండ్రి జైలు నుంచి బోరుగడ్డ విడుదల అయ్యారు. తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్ సమర్పించారు. దీంతో ఈనెల 11వరకు బెయిల్ పొడి గింపు లభించింది. అయితే.. బోరుగడ్డ సమర్పించిన సర్టిఫికెట్ నకిలీదిగా గుర్తించారు. బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావటంతో.. ఇప్పుడు బోరుగడ్డ ఎస్కేప్ వ్యవహారం సంచలనంగా మారింది.
బోరుగడ్డ ఎక్కడ..?
బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారు. ఏమయ్యారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బోరుగడ్డపై రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 14 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే హత్యాయత్నం కేసులో భాగంగా అరండల్ పేట పోలీసులు గత ఏడాది అక్టోబర్ నెలలో బోరుగడ్డ అనిల్ కుమార్ ను అరెస్ట్ చేశారు. కొన్ని కేసుల్లో మధ్యంతర బెయిల్ వచ్చినా.. తర్వాత అనంతపురం పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ మంజూరు కాలేదు.
పోలీసుల విచారణ షురూ..
న్యాయమూర్తి మెడికల్ సర్టిఫికెట్ వాస్తవికతను పరిశీలించేం దుకు ప్రాసిక్యూషన్‌కు అనుమతించారు. తప్పుడు ధ్రువపత్రం అని తేలితే తగిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5వరకు మధ్యంతర బెయిల్ పొడిగి స్తూ ఉత్తర్వులు ఇచ్చారు. బోరుగడ్డ సమర్పించిన డాక్టర్ సర్టిఫికెట్ పైన పోలీసులు విచారణ చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. గుంటూరు లలితా ఆస్పత్రిలో అనిల్ తల్లి పద్మావతి అసలు చేరనేలేదని...ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని వెల్లడైంది. దీంతో, బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనిల్‌తోపాటు ఆయన తల్లి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందని సమాచారం. దీంతో, 11వ తేదీన బోరుగడ్డ తిరిగి వస్తారా రారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.