రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఒక్కసారిగా నాగబాబు పేరు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2019లో లోక్‌సభకు ఎంపీగా పోటీ చేసి ఓడారు. గత ఎన్నికల్లోనూ పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా సాధ్యపడలేదు. ఈ క్రమంలో రాజ్యసభ సీటు ఇస్తారని భావించినా బీజేపీ కృష్ణయ్య పేరును ప్రకటించింది. దీంతో ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 24మంది మంత్రులున్నారు. అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. కాగా, టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. జనసేన నుంచి పవన్, మనోహర్, దుర్గేశ్ ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు. జనసేనకు దక్కాల్సిన మరో స్థానాన్ని నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు.