AP High Court : బిగ్‌బాస్ రియాల్టీ షోపై జోక్యం చేసుకోలేం : ఏపీ హైకోర్టు
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ రియాలిటీ షో’ ప్రసారాన్ని నిలిపేయాలని దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ ప్రోగ్రాం అసభ్యంగా ఉందంటూ కొన్ని ఫొటోలను చూపించి షోను ఆపేయాలంటే సాధ్యం కాదని స్పష్టం చేసింది. పిటిషనర్‌కు అశ్లీలంగా అనిపించిన సీన్లు ఇతర ప్రజలకు అసభ్యం కాకపోవచ్చంది. కేబుల్ టీవీ నియంత్రణ చట్టం ప్రకారం సంబంధింత అధికారుల ముందు పిటిషనర్ తన అభ్యంతరాలను లేవనెత్తవచ్చని పేర్కొంది.
బిగ్‌బాస్ రియాల్టీ షోలోని అశ్లీలత, అసభ్యతను నిలువరించాలని.. యువతను పెడదోవ పట్టిస్తున్నందున పరిమితులున్న కార్యక్రమంగా ప్రకటించి రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు మాత్రమే ప్రసారం చేయాలంటూ సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019, 2022 సంవత్సరాల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం ఇటీవల తుది నిర్ణయాన్ని ప్రకటించింది.
కొన్ని ఫొటోలను తమ ముందుంచి వాటి ఆధారంగా బిగ్‌బాస్ షోను నిలిపివేయాలంటే కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్‌కు అసభ్యం అనిపించింది.. ఎక్కువ మందికి అసభ్యం కాకపోవచ్చని పేర్కొంది. పిటిషనర్ కేవలం కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారని, సంబంధిత అధికార యంత్రాంగం వద్ద ఫిర్యాదు చేయలేదంది. పిటిషనర్ ఈ వ్యాజ్యాల్లో లేవనెత్తిన విషయాలన్నీ కేబుల్ టీవీ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల ముందు లేవనెత్తవచ్చని స్పష్టం చేసింది.