Kodali Nani: కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు

తన తల్లి మరణానికి నాని కారణమంటూ దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు;

Update: 2024-07-06 05:45 GMT

ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్ తగిలింది. ఆయనపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదయింది. ఇప్పటికే ఆయనపై ఒకట్రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజా కేసు వివరాల్లోకి వెళ్తే... తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నానితో పాటు ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, గతంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసిన మాధవీలత రెడ్డి (ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్)లను కూడా తన ఫిర్యాదులో ఆయన నిందితులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 448, 427, 506, ఆర్ అండ్ డబ్ల్యూ 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ గోడౌన్ విషయంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీ మాధవీలతపై ఆరోపణలు వచ్చాయి. వాసుదేవరెడ్డి తీరు, కొడాలి నాని అనుచరుల బెదిరింపులతో తన తల్లి మరణించిందని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్‌ గుడివాడ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి దుగ్గిరాల సీతామహాలక్ష్మి పేరున 2011లో.. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లిక్కర్‌ గోదామును రిజిస్టర్‌ టెండరులో దక్కించుకున్నట్లు ప్రభాకర్ తెలిపారు. జగన్‌ సర్కార్ వచ్చిన తర్వాత తమ లీజు అగ్రిమెంటు పూర్తి కాకుండానే బెదిరించి గోదాము ఖాళీ చేయించారని ఆరోపించారు. తన తల్లి వాసుదేవరెడ్డికి ఫోన్‌ చేస్తే ఆయన పరుష పదజాలంతో దూషించడంతో మనస్తాపానికి గురయ్యారన్నారు. ఈ గోడౌన్‌ను వైఎస్సార్‌సీపీ కార్యకర్త పద్మారెడ్డికి కట్టబెట్టేందుకే ఇలా చేశారన్నారు.

Tags:    

Similar News