CBN: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్
కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన... శంకుస్థాపన చేసినచంద్రబాబు, పవన్ కల్యాణ్... గ్రీన్ అమ్మోనియాతో పెను మార్పులు: చంద్రబాబు
భవిష్యత్ ఇంధన అవసరాలకు మార్గదర్శకంగా నిలిచే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పరిశ్రమలు, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి సృష్టి – ఈ మూడింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కాకినాడ కేంద్రంగా భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ.18 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర భవిష్యత్‌పై స్పష్టమైన దృష్టిని సీఎం వివరించారు.
కాకినాడలో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా యూనిట్‌గా నిలవనుందని చంద్రబాబు తెలిపారు. 2027 జూన్ నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుందని, తదుపరి దశల్లో సామర్థ్యం మరింత పెంచుతామని వెల్లడించారు. గ్రీన్ అమ్మోనియా అనేది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొత్త దిశగా మలిచే ‘గేమ్ ఛేంజర్’ అని ఆయన పేర్కొన్నారు. బొగ్గు ఆధారిత ఇంధనాల వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని, కాలుష్యం కారణంగా సముద్ర జీవవ్యవస్థలోనూ పెద్ద మార్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని విస్తృతంగా పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుతున్నారని గుర్తుచేశారు. అయితే 2014లోనే తమ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేసిందని, అప్పుడే సోలార్, విండ్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, భవిష్యత్‌లో 20 వరకు పోర్టులు ఏర్పాటు కానున్నాయని సీఎం వివరించారు. ఈ పోర్టులు పరిశ్రమలకు రవాణా సౌలభ్యాన్ని కల్పించడమే కాకుండా, ఎగుమతుల అవకాశాలను కూడా విస్తృతం చేస్తాయని చెప్పారు. గ్రీన్ అమ్మోనియాను ప్రపంచంలోని ఏ దేశానికైనా ఎగుమతి చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉందని, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతికతను వినియోగించుకుంటూనే మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా స్వగ్రామాన్ని, మూలాలను మర్చిపోకూడదని హితవు పలికారు. ఆలోచనలు మాత్రమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టే వ్యక్తులు చాలా అరుదని, అటువంటి వారిలో చలమలశెట్టి అనిల్ ఒకరని ప్రశంసించారు. చరిత్రను తిరగరాయడంలో తెలుగువాడు ముందుండటం గర్వకారణమని, కాకినాడ పేరు భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుందని అన్నారు. గతంలో ఎన్టీఆర్ చొరవతో కాకినాడకు నాగార్జున ఫెర్టిలైజర్స్ పరిశ్రమ వచ్చిందని గుర్తు చేస్తూ, అప్పటి నుంచి ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎదుగుతూ వస్తోందని చెప్పారు. ఇలాంటి భారీ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు సమృద్ధిగా ఉన్నాయన్నారు.