CBN: టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం
48 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు.. 48 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ప్రజల్లోకి కొందరు ఎమ్మెల్యేలు వెళ్లకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ తీరు మారకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో48 మంది ఎమ్మెల్యేలు పాల్గొనడంలేదని గుర్తించారు. వారందరికీ నోటీసులు ఇవ్వాలని కూటమి పార్టీ అధ్యక్షులను ఆదేశించారు. స్వయంగా తాను లబ్ధిదారులను కలిసి పింఛన్లు అందిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రజలకు సేవలందించడంలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు తమ నియోకవర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహించాల్సిదేనన్నారు. ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరూ బేఖాతరు చేసినా భవిష్యత్తులో పరిణామాలు తప్పవ్ అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. వివరణ తీసుకున్నాక చర్యలకూ వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని సూచించారు. బ్యాక్ ఆఫీసు, ప్రోగ్రాం కమిటీకి ఆదేశాలు జారీ చేస్తూ, ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని సూచించారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేదల సేవలో భాగంగా పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడాలని సూచించారు. టీడీపీ కార్యకర్తలకు ఇన్సురెన్స్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలి.
పనితీరు మారకపోతే పక్కన పెట్టాలి
పేదలకు ఎన్నోకష్టాల్లో ఉంటే సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటారు. వారికి మంజూరు అయిన డబ్బులు కూడా ఇవ్వడానికి ఎమ్మెల్యేలకు తీరిక లేకపోతే ఇక వారికి ప్రజా సేవ చేయడానికి అర్హత ఏముంటుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. సీఎం ఆర్ఎఫ్ చెక్కులకు మూడు నెలల పరిమితి ఉంటుంది. ఇష్యూ చేసిన తేదీ నుంచి మూడు నెలల పాటు చెక్కులు పంపిణీ చేయకపోవడం వల్ల అవి తిరిగి వస్తున్నాయి . కొత్తగా చెక్కులు జారీ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది సీఎంను అసహనానికి గురి చేసింది. ఇప్పటి వరకూ చూశామని ఇక పనితీరు మార్చుకోకపోతే పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి శుక్రవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయాల్లో జరిగే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. పాల్గొనకపోతే పార్టీ కేంద్ర కార్యాలయం వివరణ తీసుకోవాలి ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గతంలో కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ మొదలైంది.
బిహార్లో మంత్రి లోకేశ్ ప్రచారం
బిహార్లో ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 11న సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో బీజేపీ స్పీడు పెంచింది. ఏపీ మంత్రి నారా లోకేశ్.. ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కల్యాణదుర్గం పర్యటన ముగించుకొని నారా లోకేశ్ పట్నా చేరుకున్నారు. రెండు రోజులపాటు ఎన్డీయే అభ్యర్థుల తరఫున లోకేశ్ ప్రచారం చేయనున్నారు. రెండో దశలో 122 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు ప్రజలు ఉన్నచోట లోకేశ్ ప్రచారం సాగనుంది.