CBN: ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు
కర్నూలు, కడప ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త తెలిపారు. ప్రధాని మోడీ సమక్షంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ బహిరంగ సభలో ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్, స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాయలసీమకు సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.
రాబోయే రోజుల్లో మరిన్ని...
మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారన్నారు. ‘‘సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయి. 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందనడంలో సందేహం లేదు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు ప్రధాని మోదీ. అలాంటి నాయకుడిని పొందడం.. దేశం ఎంతో అదృష్టం చేసుకుంది. చాలా మంది ప్రధానులతో పనిచేసినా.. మోదీ వంటి నాయకుడిని చూడలేదు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరాం. ఆపరేషన్ సిందూర్.. మన సైనిక బలం నిరూపించింది. మాటలతో కాదు.. చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని మోదీ.” అని అన్నారు. ‘‘సరైన సమయంలో సరైన చోట సరైన వ్యక్తిగా ప్రధాని మోడీ ఓ విశిష్టమైన వ్యక్తి.. 21వ శతాబ్దపు నేత. ఎందరో ప్రధానమంత్రులతో కలిసి పని చేసినా మోదీ లాంటి వ్యక్తిని చూడలేదు.” అని చంద్రబాబు అన్నారు.
ప్రధాని కర్మయోగి: పవన్
ఎలాంటి ఫలితాలు ఆశించకుండా కేవలం దేశ సేవే పరమావధిగా పని చేస్తున్న ప్రధాన నరేంద్ర మోడీని మనం కర్మయోగిగా చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ బహిరంగ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మోదీ దేశాన్ని మాత్రమే కాదని, రెండు తరాలను నడుపుతున్నారని తెలిపారు. ప్రపంచమంతా దేశం వైపు తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చారని కొనియాడారు. ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అంటూ ప్రశంసించారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.