CBN: విశాఖలో కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన
టెక్ హబ్‌గా వైజాగ్: సీఎం చంద్రబాబు... కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపన... విశాఖలో మరో 9 ఐటీ కంపెనీలకు భూమిపూజ... విజాగ్ ఆర్థిక రూపురేఖలు మారనున్నాయ్: సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి తమ విజన్ స్పష్టంగా ఉందని, దానిని అనుసరించి అద్భుతాలు సాధిస్తున్నామని ఉద్ఘాటించారు. విశాఖపట్నం నగరాన్ని నాలెడ్జ్ ఎకానమీ మరియు టెక్నాలజీకి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. శుక్రవారం నాడు విశాఖలో కాగ్నిజెంట్ సంస్థకు శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ మరియు సంస్థ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్, సత్వా (Satva) సంస్థలతో పాటు మరో ఏడు ఐటీ సంస్థలకు ఆయన భూమిపూజ చేశారు. ఈ పరిణామంతో విశాఖ నగరం యొక్క ఆర్థిక రూపురేఖలు మారనున్నాయని, దీనిని ఎకనమిక్ రీజియన్ కింద అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కాగ్నిజెంట్‌కు భారతదేశంలో చెన్నై, హైదరాబాద్, పుణె, బెంగళూరు, కోల్‌కతాలలో ఐదు సెంటర్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ సంస్థ హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అగ్రగామిగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా దాని ఉద్యోగుల్లో 2,41,500 మంది భారత్ నుంచే పనిచేస్తున్నారని, వీరిలో 80 శాతం మంది భారతీయులేనని తెలిపారు.
కాగ్నిజెంట్ చీఫ్ కూడా మన దేశానికి చెందిన వ్యక్తే కావడం మన భారతీయుల శక్తికి నిదర్శనమని అన్నారు. త్వరలో విశాఖకు మెట్రో కూడా రానుందని, సముద్రం, కొండలతో అందంగా ఉండే ఈ నగరం అన్ని విధాలా ఐటీ సంస్థలకు అనుకూలమని పేర్కొన్నారు.
జాప్యం లేకుండా అనుమతులు: మంత్రి లోకేశ్
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, కాగ్నిజెంట్ పెట్టుబడులతో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఐటీ సంస్థల రాకతో విశాఖకు మరింత వెలుగు వచ్చిందని తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, తమ విధానం 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నుంచి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' గా మారిందని స్పష్టం చేశారు. ఐటీ సంస్థల కోసం రాయితీ ప్యాకేజీపై నిన్నటి మంత్రివర్గంలో కూడా చర్చించామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఒక అడుగు ముందున్నామని, గత 18 నెలల నుంచి పెట్టుబడులకు ముందుకొచ్చిన అనేక సంస్థలకు వెంటనే భూ కేటాయింపులు జరిగాయని, జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేస్తున్నామని లోకేశ్ వెల్లడించారు. విజనరీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టమని అన్నారు.