cbn: కూటమి పాలనలో పేదలకు నివాస యోగ్యం
కూటమి పాలనలో పేదలకు నివాస యోగ్యం... హామీల అమలు దిశగా కూటమి సర్కార్... మరో హామీ అమలు దిశగా ప్రభుత్వం చర్యలు;
ఏపీలోని నిరుపేదలకు శుభవార్త.. మరో హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల సమయంలో నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హామీ అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్రామాల్లో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఆఫ్లైన్ పద్ధతిలో జరుగుతోంది. శనివారం నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు చెప్తున్నారు.
పట్టాల పంపిణీపై ప్రత్యేక దృష్టి
ఇళ్లు లేని పేదలకు పట్టాల పంపిణీపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల్లో లబ్ధిదారులు, ఇంటి స్థలాల గుర్తింపు ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతోంది. తొలి విడత కింద ఎంపికైన అర్హులకు వీలైనంత తొందరగా ఇంటి పట్టాలను అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జగన్ పాలనలో అస్తవ్యస్తంగా రూపొందించి లబ్ధిదారులకు కేటాయించకుండా వదిలిన లేఅవుట్లలను గుర్తించి కొత్త లబ్ధిదారులకు సర్దుబాటు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 6.53 లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. రెండు సంవత్సరాల్లోగా ఇంటి పట్టాల పంపిణీ పూర్తి చేసి, నిర్మాణాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైకాపా హయాంలో స్థలాలు పొందిన వారు వెనక్కు ఇచ్చినట్లయితే.. అటువంటి వారికి సదరు లేఅవుట్లలోని ఖాళీ స్థలాల్లో సర్దుబాటు చేయనున్నారు.
పట్టణాలలో రెండు సెంట్లు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పొంది ఇల్లు నిర్మించని వారికి కూడా ఈ పథకం వర్తింపజేయనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూములను సేకరించారు. అవసరమైతే ఆ భూములకు అదనంగా భూమిని సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల స్వీకరణ మొదలుకాగా.. లబ్ధిదారులలో ఆనందం వ్యక్తమవుతోంది.
ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు ఇలా..
మరోవైపు ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్ల స్థలాల కోసం శనివారం నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హులై ఉండి.. ఇళ్ల స్థలాలు కావాల్సిన వారు తమ ఆధార్ కార్డు. రేషన్ కార్డులతో పాటుగా పాస్పోర్టు సైజు ఫోటోతో గ్రామ సచివాలయాలను సంప్రదించాలి. సచివాలయ సిబ్బందికి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణాలలో సెంటు, గ్రామాలలో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. అయితే చాలామంది పట్టాలు తీసుకున్నప్పటికీ అందులో ఇళ్ల నిర్మాణాలు జరపలేదు.