CBN: పెట్టుబడుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయి
చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సదస్సు.. రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 30కి పైగా ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదముద్ర
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11వ ఎస్ఐపీబీ (పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 67 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబదులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్న రైడెన్ ఇన్ఫో టెక్ డేటా సెంటర్కు ఆమోదించింది. రైడెన్ ఇన్ఫో టెక్ డేటా సెంటర్ ఏర్పాటు అతి పెద్ద ఘనతగా ఎస్పీఐబీ భావిస్తోంది. అతిపెద్ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ సాధించడంపై లోకేశ్, చంద్రబాబు, మంత్రుల అభినందనలు తెలిపారు.
భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రణాళిక
కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా బాధ్యతను ప్రత్యేక అధికారులు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో రాష్ట్రంలో రూ.53,922 కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. చిత్తూరు జిల్లాలో మదర్ డెయిరీ లిమిటెడ్ సంస్థ 180 మందికి ఉపాధి కల్పించేలా 427 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ జిల్లాలోనే ఏసీఈ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ 786 కోట్లతో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనుండగా, అపోలో టైర్స్ 1110 కోట్ల పెట్టుబడులతో 500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో వరాహా ఆక్వా ఫార్మ్స్ సంస్థ 32 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 3,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖలో జె. కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 237 కోట్ల పెట్టుబడులతో 5,000 మందికి ఉపాధి లభించనుంది. చిత్తూరులో అలీప్ సంస్థ 2,500 ఉద్యోగాలు కల్పించేలా 45 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.
అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీ
అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 21 మందితో సలహా కమిటీని నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ ఛైర్మన్ గా నీతి ఆయోగ్ మెంబరైన వీకే సారస్వత్ ను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే కో ఛైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, కమిటీ సభ్య కార్యదర్శిగా ఎస్ఆర్ఎం గ్రూప్ డైరెక్టర్ నారాయణరావు నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, హైడ్రోజన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆర్కే మల్హోత్రా తదితరులను కమిటీలో సభ్యులుగా నియమించారు. హైడ్రోజన్, దాని ఉత్పత్తుల ప్రమోషన్ కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.