cbn: నేరచరిత్ర ఉన్న నేతలను ఊడ్చేయాలి
నేర రాజకీయాలను సహించబోనని వెల్లడి... నేరస్థుల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు;
నక్సలైట్లు తనను చంపాలని చూశారని, కానీ ఆ వెంకటేశ్వరస్వామినే కాపాడారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో పర్యటించిన ఆయన పలు కీలక విషయాలు ప్రజలతో పంచుకున్నారు. తానెప్పుడూ హత్యా రాజకీయాలు చేయాలని అనుకోలేదని, అలా అనుకుని ఉంటే ఎవరినీ వదలిపెట్టేవాడిని కాదన్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందారెడ్డిని చంపి గుండె పోటు అంటూ వైసీపీ నేతలు డ్రామాలు అడారని గుర్తు చేశారు. నేరచరితులు రాజకీయాల్లోకి వచ్చారని, ఇంట్లో చెత్తను తీసినట్టే వాళ్లను కూడా తీయాలని చెప్పారు. తాను నక్సలిజం, ఫ్యాక్షన్ మతకలహాలపై పోరాటం చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చాలంటే ముందు స్వచ్ఛాంధ్రగా తయారు చేయాలని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీకి కేరాఫ్ అడ్రస్‌గా అమరావతిని మార్చుతామన్నారు. రాష్ట్ర రాజధానిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మించి ఏఐని అభివృద్ధి చేస్తామని చెప్పారు. తిరుపతిలో ప్రఖ్యాత విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. నేర రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నామని తెలిపారు. కాలుష్యం లేకుండా గ్రీన్ హైడ్రోజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు. వాతావరణాన్ని ముందుగా తెలుసుకునేందుకు త్వరలో ఓ యాప్‌ను తీసుకురాబోతున్నామన్నారు. 700 ప్రభుత్వ సేవలను ఆగస్టు 15 నాటికి వాట్సాప్ ద్వారా అందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
నెలకో కార్యక్రమం
రాష్ట్రాభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు. ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్చాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఏపీకి 5 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తాను తిరుపతిలో చదువుకుంటూనే ఎమ్మెల్యేగా ఎదిగానని, అంచెలంచెలుగా ఎదిగి నాలుగోసారి సీఎం అయ్యానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నేర చరిత్ర కలిగిన నేతలు రాజకీయాల్లోకి వచ్చారు. ఇంట్లో చెత్తను ఊడ్చినట్లు.. నేరచరిత్ర ఉన్న నేతలను ఊడ్చేయాలని చంద్రబాబు అన్నారు.
హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్
.. ‘‘విద్యుత్ సంస్కరణలు మొదట ప్రారంభించింది నేనే. 1999లో మొదటిసారి అమలు చేశా. సంస్కరణలు అమలు చేసిన కారణంగా అప్పట్లో అధికారం కోల్పోయాం. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజీపై దృష్టి సారించాలి. ఏపీ ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలి. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. నీతి ఆయోగ్ కూడా దీనిపై దృష్టి సారించింది. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ హైడ్రోజన్ వ్యాలీగా మారనుంది. గ్రీన్ హైడ్రోజన్ తయారీ, రవాణాకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి." అని చంద్రబాబు వెల్లడించారు.