CBN: మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు
సంక్షేమ పాఠశాల విద్యార్థులతో చంద్రబాబు భేటీ... ఐఐటీ, నిట్, నీట్లో సత్తా చాటిన వారికి సత్కారం...;. రూ.లక్ష చెక్కుతో పాటు జ్ఞాపిక అందజేసిన సీఎం;
మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల విద్యార్థులు ఇటీవల సాధించిన ఫలితాలు వారి సమర్థతను రుజువు చేస్తున్నాయని చెప్పారు. ఐఐటీ, నిట్, నీట్లో ప్రతిభ చూపిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సీఎం చంద్రబాబును కలిశారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా సీఎం రూ.లక్ష చెక్కుతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ మేరకు చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ-నీట్ సెంటర్లలో కోచింగ్ పొంది ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్లో 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సీట్లు సాధించారు. సచివాలయంలో నన్ను కలిసిన సందర్భంగా వారు తమ సంతోషాన్ని నాతో పంచుకుంటే ఎంతో సంతృప్తి కలిగింది. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీట్లు పొందిన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష ప్రోత్సాహకం, జ్ఞాపిక అందించి అభినందించాను. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపయోగపడేలా కొత్తగా మరో 7 ఐఐటీ-నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. సరైన సదుపాయాలు, శిక్షణ, సాయం అందిస్తే ప్రపంచంలోని అందరితో పోటీ పడే సత్తా మన విద్యార్థులకు ఉంది. వీరి విజయం ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను’’ అని సీఎం పేర్కొన్నారు.