CBN: డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాలపై చంద్రబాబు సమీక్ష
పరిశ్రమల అభివృద్ధిని వేగవంతం చేయడంపై చర్చ
, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కేంద్రం ప్రతిపాదించిన డీ-రెగ్యులేషన్ విధానాలపై రాష్ట్ర స్థాయిలో సమగ్ర సమీక్ష నిర్వహిస్తూ, వ్యాపారాలకు అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాలపై సవివరంగా చర్చ జరిగింది. పరిశ్రమల ఏర్పాటులో అనవసరమైన ఆలస్యాలను తగ్గించడం, అనుమతుల కోసం పెట్టే నిబంధనలను సరళీకరించడం ప్రధాన అంశాలుగా నిలిచాయి. ప్రస్తుతం ఉన్న 800కు పైగా నిబంధనలను 100 లోపునకు పరిమితం చేయాలని సీఎం సూచించడం విశేషం. అయితే ఈ ప్రక్రియలో ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
అనుమతుల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అధికారుల వేధింపులు లేకుండా పరిశ్రమలు సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అటవీ చట్టాలను కూడా సరళీకరించి, పరిశ్రమల స్థాపనకు అడ్డంకులు తొలగించాలన్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో జాతీయ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు రూపొందించాల్సిన అవసరాన్ని సూచించారు. డబుల్ లైసెన్సింగ్ వంటి పద్ధతులను పూర్తిగా నివారించాలన్నది సీఎం స్పష్టమైన అభిప్రాయంగా చెప్పారు. మే నెలాఖరులోగా డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రం అనుమతుల వ్యవస్థలో ముందంజలో ఉందని కేంద్ర ప్రతినిధి బృందం అభినందించగా, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.
ఇదే సమయంలో డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై కూడా చర్చ జరిగింది. జూన్ నెల నుంచి ఈ దశపై పని ప్రారంభిస్తామని కేంద్ర బృందం వెల్లడించగా, ఆ దశలో టెక్నాలజీ వినియోగం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత విధానాలకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టిస్తూ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. డీ-రెగ్యులేషన్ చర్యలు అమల్లోకి వస్తే వ్యాపారాలకు మరింత సౌలభ్యం కలగడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వనున్నాయి.