AP: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు షురూ
13 నగరాలు, 87 పట్టణాల్లో పునర్విభజన.. ఇప్పటికే ఆరంభమైన విభజన ప్రక్రియ... పెరగనున్న 736 డివిజన్లు, వార్డులు... ఓటర్ల జాబితాల ప్రచురణకు కసరత్తు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ రాజకీయాలకు మళ్లీ కదలిక వచ్చింది. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రభుత్వం వేగంగా ముందడుగు వేస్తుండగా, వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కావడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న ఈ ఎన్నికలకు సంబంధించి పరిపాలనా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతుండటం విశేషం. రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీలు, 13 నగరపాలక సంస్థల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ సంస్థల్లో కలిపి 3,206 వార్డులు, డివిజన్లు ఉండగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని సరిహద్దులను తిరిగి ఖరారు చేయడం, ఓటర్ల సంఖ్యను సమతుల్యం చేయడం ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మొత్తం వార్డుల సంఖ్య సుమారు 3,942కు చేరే అవకాశం ఉందని అంచనా. అంటే కొత్తగా 736 వార్డులు, డివిజన్లు అందుబాటులోకి రానున్నాయి.
పునర్విభజన పూర్తికాగానే ఎన్నికలు
ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల నిర్వహణకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ప్రాథమిక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వార్డుల హద్దులను ఖరారు చేసిన అనంతరం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారు. ఆ తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులు చేసి కలెక్టర్ ద్వారా తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి అయితే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొన్ని సంస్థల్లో కూడా త్వరలో పదవీకాలం ముగియనుంది. అయితే ఎన్నికలు ఇప్పుడే నిర్వహించినా, పాత పాలకవర్గాల గడువు పూర్తయ్యాకే కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు బాధ్యతలు చేపడతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవడంతోనే రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. వార్డుల వారీగా సమీకరణాలు, స్థానిక సామాజిక వర్గాల ప్రాధాన్యత, ఓటర్ల అభిరుచులు వంటి అంశాలను విశ్లేషిస్తూ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న సంకేతాలతో రాజకీయ కార్యకలాపాలు మరింత చురుకుగా మారాయి.
అయితే ఈ ప్రక్రియలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో గ్రామాలు, పంచాయతీలను పట్టణ సంస్థల్లో విలీనం చేసిన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పలువురు కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసులు పరిష్కారమయ్యే వరకు ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. తుది తీర్పు వచ్చిన తర్వాతే ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు
కీలకంగా మారనున్న రిజర్వేషన్లు
రిజర్వేషన్ల అంశం కూడా కీలకంగా మారనుంది. బీసీల గణన కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ త్వరలో నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా వార్డులు, డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఓటర్ల జాబితాల తయారీ కూడా ఈ ప్రక్రియలో ముఖ్యమైన దశ. పునర్విభజన అనంతరం వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి, తుది ప్రచురణ చేయనున్నారు. ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాల సంఖ్యను నిర్ణయించనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం పురపాలక శాఖకు సూచనలు జారీ చేసింది. అవసరమైన సమయం ఇవ్వాలని శాఖ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల సంఘం ఆమోదించినట్లు సమాచారం.