CBN: సంక్షేమంలో అగ్రస్థానం మనదే: చంద్రబాబు
విజయనగరంలో ప్రజా వేదిక సభలో పాల్గొన్న సీఎం... పెన్షన్ల కోసమే రూ.48 వేల కోట్లు ఖర్చు చేశాం... సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామన్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమంలో టాప్‌లో నిలిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లాలోని దత్తిలో నిర్వహించిన ప్రజా వేదిక సభలో పాల్గొన్నారు.కేవలం 16 నెలల కాలంలో పెన్షన్లకు మాత్రమే రూ.48 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో ఆనందంగా పండగ చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ చేసి చూపించామని తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చామని గుర్తు చేశారు. రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ చేశామని అన్నారు.
ఒకప్పుడు పండగ అంటేనే భయం
" ఒక్కప్పుడు పండగ చేసుకోవడం అంటే భయం.. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. ఒకటో తారీఖునే పెన్షన్ వస్తోంది.. ఇది కూటమి ప్రభుత్వం సత్తా.. మరే ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు" అని సీఎం చంద్రబాబు అన్నారు. "ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం.. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నాం అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం.. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ కట్ అయిపోయేది… ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. మూడు నెలలు వరకూ చూస్తున్నాం.. మీరు మట్టి పనులకు వెళ్లినా అక్కడికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాం" అన్నారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. దీపం-2 పథకంలో భాగంగా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.
అక్టోబర్ 4న అటోడ్రైవర్లకు సేవలో..
అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు సేవలో పథకం ద్వారా రూ.15 వేలు ఇస్తామని అన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించిన 15 వేల మందికి ఉద్యోగలు ఇచ్చామని వెల్లడించారు. గతంలో జగన్ పర్యటనలకు వస్తే చెట్లు నరికేవారని.. ప్రజలు జగన్ మీటింగ్‌ల నుంచి వెళ్లకుండా గోతులు తవ్వేవారని ఎద్దేవా చేశారు. ప్రజలకు నవ్వడానికి వీలు లేకుండా జగన్ రాష్ట్రాన్ని పాలించారని కామెంట్ చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమితో ప్రజలకు మళ్లీ స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. తాను జగన్‌లా తుగ్లన్ని కాదు.. మంచి పాలన అందించి రాష్ట్రాన్ని అగ్ర పథాన నిలుపుతానని అన్నారు. " ఆదాయాన్ని పెంచడం కోసం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు ఆదాయం పెరగాలి. ఒకప్పుడు రైతును పట్టించుకునే పరిస్థితి లేదు. ఆహారపు అలవాటలు మారాలి. నేను వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెచ్చమని చెప్పాం.. కానీ, ఇప్పుడు ట్రూ ఆప్ ఛార్జీలను తగ్గించాం. ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్లు పెట్టి రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. డ్వాక్రా రుణాలు తీసుకున్న ఆడ బిడ్డలు తిరిగి కడుతున్నారు. పెద్దవాళ్లు రుణాలు కట్టలేదు గానీ.. ఆడబిడ్డలు మాత్రం తిరిగి చెల్లిస్తున్నారు." అని సీఎం వెల్లడించారు.