CBN: తెలుగు జాతిని నెంబర్ వన్ చేస్తా
ప్రపంచంలో మనకి తిరుగేలేదన్న సీఎం.. దుబాయ్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం.. భారీగా తరలివచ్చిన ప్రవాసాంధ్రులు.. మాతృభూమిని మరువద్దంటూ సీఎం సూచన
యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. తన పర్యటనలో చివరి కార్యక్రమంగా దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్లో ఏర్పాటు చేసిన ‘తెలుగు డయాస్పోరా’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి ప్రవాసాంధ్రులు, తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సభకు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్ వేమూరి రవి తదితరులు హాజరయ్యారు.
అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. "ప్రపంచంలో తెలుగు జాతికి తిరుగే లేదు. ప్రపంచంలో తెలుగు జాతిని నెంబర్ వన్ గా నిలబెట్టడమే నా లక్ష్యం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగువారు ఉన్నత స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని అన్నారు. తెలుగు జాతికి తిరుగే లేదని, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా తయారవుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించానని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని చంద్రబాబు వివరించారు.
గ్లోబల్ లీడర్లుగా తెలుగు ప్రజలు
‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నతస్థాయిలో ఉండాలని ఆకాంక్షించా. జన్మభూమిని.. కర్మభూమిని ఎప్పుడూ మీరు మరవద్దు. యూఏఈలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారంటే మంచి అభిప్రాయం కనిపించింది. దుబాయ్‌లో ఏ కార్యాలయానికి వెళ్లినా తెలుగువారు ఉన్నతస్థానాల్లో కనిపించారు. గ్లోబల్ లీడర్ల స్థాయికి చేరారు. అంతా జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. పాతికేళ్ల క్రితం ప్రతి ఇంటికీ ఒక ఐటీ ప్రొఫెషనల్‌ను తయారుచేయాలని చెప్పా. మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తే.. అందులో ఉద్యోగిగా చేరిన సత్య నాదెళ్ల ఇప్పుడు అదే సంస్థకు సీఈవోగా ఉన్నారు’ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ’30 ఏళ్ల ముందు ఐటీని ప్రోత్సహించాను. తెలుగు వాళ్లు ఐటీ నిపుణులుగా ఇప్పుడు ప్రపంచం అంతా రాణిస్తున్నారు. సత్యనాదెళ్ల లాంటి తెలుగు వాళ్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి కోసం ప్రవాసాంధ్రులంతా తపించి గెలిపించారు. గల్ఫ్ దేశాల నుంచి మీరు తరలివచ్చి తెలుగు డయాస్పోరాకు హాజరు కావటం ఆనందాన్ని కలిగిస్తోంది. అబుదాబీ, దుబాయ్ ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జి ఎకానమీ దిశగా నడుస్తున్నాయి. 1.50 లక్షల హోటల్ రూములతో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది’ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.