AP Special Status: ఎజెండాలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చిన కేంద్రం.. తర్వాత పొరపాటు అంటూ..
AP Special Status: నాలుగేళ్లుగా ఒకే పాట పాడుతున్న కేంద్రం.. సడన్‌గా స్పెషల్ స్టేటస్ అంశం జోడించడంతో అంతా ఆశ్చర్యపోయారు.;
AP Special Status: ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం అంటూ చెప్పుకొచ్చిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల మధ్య తగువు తీర్చేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో ఆ ఆంశాన్ని చేర్చింది. దాదాపు నాలుగేళ్లుగా ఒకే పాట పాడుతున్న కేంద్రం.. సడన్‌గా స్పెషల్ స్టేటస్ అనే అంశం జోడించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ప్రత్యేక హోదా అంశం ఇంకా సజీవంగానే ఉందన్న మాట అని భావించారు.
అందులోనూ స్వయంగా కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన సర్క్యులర్ అది. రాష్ట్రాలకు హోదా ఇవ్వాలా వద్దా అని తేల్చేది కేంద్ర హోం శాఖనే. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జరిగే చర్చల్లో ప్రత్యేక హోదాను చేర్చడంతో.. ఇంకేముంది స్పెషల్ స్టేటస్ సాధించుకునేందుకు ఓ మార్గం దొరికిందని అనుకున్నారు. ఇస్తారా ఇవ్వరో తరువాత సంగతి.
కనీసం చర్చలైతే జరుగుతాయి కదా అని భావించారు. కొన్ని సాయంత్రం లోపే రివర్స్ గేమ్ ఆడింది కేంద్రం. ప్రత్యేక హోదా అంశాన్ని పొరపాటున చేర్చామంటూ మరో నోట్ రిలీజ్ చేసింది. రివర్స్ టెండరింగ్‌తో గేమ్ ఆడుతున్న జగన్ ప్రభుత్వానికి.. అసలు సిసలు రివర్స్ టెండర్ పడింది. ప్రత్యేక హోదా అంశం మొదటి నుంచి జగన్ ప్రభుత్వాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది.
నిన్న తగిలిన దెబ్బ అయితే.. ఇప్పుడప్పుడే మరిచిపోయేది కాదంటున్నారు విశ్లేషకులు. కేంద్ర హోం శాఖ చేసిన పనికి.. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించక తప్పని పరిస్థితి ఏర్పడింది జగన్ ప్రభుత్వానికి. ఈ మూడేళ్లలో హోదాపై గట్టిగా మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఫస్ట్ ప్రెస్‌మీట్‌లోనే ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుకోవాల్సిందే అన్నారు. ఆ తరువాత ప్రత్యేక హోదా అంశం చాలా దూరంలోనే ఉందన్నారు.
నిన్న పొరపాటున త్రిసభ్య కమిటీ నోట్‌లో స్పెషల్ స్టేటస్‌ను చేర్చే సరికి.. ఇదంతా జగన్ పట్టుదల వల్లే జరిగిందంటూ మాట్లాడడం మొదలుపెట్టారు.నిన్న వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు చూసి ఏపీ ప్రజలు అవాక్కవుతున్నారు. జగన్ దగ్గర పరపతి సాధించేయాలన్న తాపత్రయమో ఏమో గానీ.. వైసీపీ పెద్దలంతా పోటీలు పడి మరీ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ అయితే జగన్‌ను ప్రత్యేక హోదా సాధకుడు అనేశారు.
కేంద్ర అంశాల్లో ప్రత్యేక హోదాను చేర్చడం పూర్తిగా జగన్ విజయమని రోజా కామెంట్ చేశారు. అసలు జగన్ ఢిల్లీ వెళ్లేదా ప్రత్యేక హోదా సాధన కోసం అంటూ అంబటి రాంబాబు లాంటి వాళ్లు మాట్లాడారు. కేంద్ర హోం శాఖ తన నోట్‌ను సరిచేసుకుని మళ్లీ విడుదల చేయడంతో.. సాయంత్రానికల్లా వైసీపీ నేతల మైక్ కట్ అయింది. వెంటనే ప్రజలు, ప్రతిపక్షాలు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.
ఎజెండాలో చేర్చగానే అది తమ విజయమని చెప్పుకున్న వాళ్లు.. ఎజెండా నుంచి తీసేసిన తరువాత కూడా అంతే చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. జగన్‌కు ప్రత్యేక హోదా సాధించగల సత్తా ఉన్నట్టైతే.. 17వ తేదీన జరిగే మీటింగ్ ఎజెండాలో హోదా అంశాన్ని చేర్పించాలని సవాల్ విసిరారు. 25మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే కేంద్రానికి దాసోహం అయ్యారని, హోదాను పక్కనపెట్టేశారని విమర్శిస్తున్నారు.
విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని, అశాస్త్రీయ విభజనతో రెండు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నాయని మోదీ చెప్పిన కారణంగానే త్రిసభ్య కమిటీ ఏర్నాటైంది. అఫ్‌కోర్స్.. పొరపాటుగానైనా సరే.. నిన్న విడుదలైన సమావేశపు అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చారంటే అది మోదీ చేసిన వ్యాఖ్యల వల్లే.
కాని, అదేదో జగనే సాధించారని వైసీపీ అధికార మీడియా ఊదరగొట్టేసింది. చివరికి ఎంపీ జీవీఎల్ వచ్చి క్లారిటీ ఇవ్వడంతో సద్దుమణిగారు. మొత్తానికి ప్రత్యేక హోదా అంశం లేకుండానే త్రిసభ్య కమిటీ ఫస్ట్ మీటింగ్ ఈనెల 17న జరగబోతోంది. కేవలం హోదానే కాదు.. ఉత్తరాంధ్ర, వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల అంశాన్ని కూడా జాబితా నుంచి తొలగించారు. ఇప్పటికైనా జగన్ కేంద్రాన్ని నిలదీయాలంటూ గళమెత్తుతున్నారు జనం.