BJP Andhra Pradesh : లిక్కర్ స్టిక్కర్ కింగ్ జగన్‌ను ఇంటికి పంపే టైం వచ్చింది : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
BJP Andhra Pradesh : ఏపీలో యువకులంతా జగన్‌కు అండగా నిలిచి గెలిపిస్తే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు;
BJP Andhrapradesh : ఏపీలో యువకులంతా జగన్‌కు అండగా నిలిచి గెలిపిస్తే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు. జగన్‌ను గెలిపించిన యువతే ఇప్పుడు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. విజయవాడలో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సంఘర్షణ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయే విధంగా జగన్ పాలన సాగుతోందని విమర్శించారు. 'జగన్ బాబూ.. ఏదీ మా జాబ్ 'అని రాష్ట్రంలోని యువకులంతా నిలదీస్తున్నారన్నారు.
రాష్ట్రంలో మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. ఈ మాఫియాలన్నింటి ఆట కట్టిస్తుందని చెప్పారు. ఢిల్లీలో డ్రగ్ మాఫియాలో కేజ్రీవాల్ పాత్ర ఉందని.. అక్కడి లిక్కర్ మాఫియాతో ఏపీ ప్రభుత్వానికీ లింకు ఉందని ఆరోపించారు. అవి త్వరలోనే బయటకొస్తాయని తెలిపారు. గంజాయి మాఫియాతో ఏపీలో యువత నిర్వీర్యం అయిపోతుందన్న ఆయన.. సీఎం ఇప్పుడైనా మేలుకోని గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. అవినీతిలో ఏపీ నాలుగో స్థానంలో ఉంటే.. తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. కేసీఆర్, జగన్‌లు అవినీతిలో ప్రథమ స్థానం కోసం పోటీ పడుతున్నారని ఠాకూర్ మండి పడ్డారు.
మరోవైపు ఏపీ రాజకీయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలో కీలక పరిణామాలు జరగబోతున్నాయన్నారు. ఎవ్వరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అన్నారు. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతోందన్నారు. రాజకీయ పరిణామాలు ఈ విధంగా ఎలా జరిగాయోననే విషయం ఎవ్వరికీ అర్ధం కాదన్నారు. ఏపీలో త్వరలో సినిమా సీన్లను మించిన స్థాయిలో పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు.
జగన్‌కు జీఎస్టీ కంటే జేఎస్‌టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి అంటూ సెటైర్లు వేశారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. జగన్ లిక్కర్ కింగ్ మాత్రమే కాదు.. స్టిక్కర్ కింగ్ అని విమర్శించారు. కేంద్ర పథకాలకు జగన్ తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆయన అన్నారు. యవ సంఘర్షణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ దేవ్‌ధర్, సీఎం రమేశ్,సత్యకుమార్, పురంధేశ్వరి, విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.