KAVITHA: కేసీఆర్ దగ్గరున్న దెయ్యం సంతోష్‌రావు
సంతోష్‌రావు దుర్మార్గుడు, దెయ్యం..కార్యకర్తలు దూరం కావడానికి ఆయనే కారణం... నేతలు వీడడానికి సంతోష్రావే కారణం... సంతోష్.. రేవంత్ రెడ్డి గూఢచారన్న కవిత
మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగినిపల్లి సంతోష్‌రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కార్యకర్తలు, ఉద్యమకారులు, సీనియర్ నేతలు దూరమవడానికి ప్రధాన కారణం సంతోష్‌రావేనని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్లో నాయకులు, కార్యకర్తలకు తీవ్ర మనోవేదన కలిగించిన తొలి వ్యక్తి సంతోష్‌రావేనని కవిత వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలం నుంచి పార్టీ నిర్మాణం వరకు కీలక పాత్ర పోషించిన నేతలు ఒక్కొక్కరిగా దూరమయ్యేందుకు ఆయన వ్యవహారశైలే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధినేత కేసీఆర్‌కు ఉద్యమకారులను దూరం చేసిన మొదటి వ్యక్తి సంతోష్‌రావేనని ఆమె పేర్కొన్నారు.
గద్దర్‌ను నిలబెట్టింది కూడా ఆయనే
ఉద్యమ నాయకులు, సాంస్కృతిక వ్యక్తులు పార్టీకి దగ్గర కాకుండా అడ్డుకున్నారని కవిత విమర్శించారు. ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిచిన గద్దర్ వంటి నేతలు కూడా గౌరవం పొందని పరిస్థితి ఏర్పడిందంటే, దానికి కారణం సంతోష్‌రావు వ్యవహారమేనని ఆరోపించారు. అలాగే ఈటెల రాజేందర్ లాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు పార్టీ వీడటానికి కూడా ఆయన వ్యవహారమే కారణమని అన్నారు. సంతోష్‌రావు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అంటకాగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వ్యక్తిగత విషయాల నుంచి ఫామ్‌హౌస్‌లో జరిగే చిన్న విషయాల వరకూ సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత సమాచారం లీక్ కావడం వెనుక కూడా ఆయనే ఉన్నారన్న ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్‌రావుపై సిట్ విచారణ జరుగుతుందన్న ప్రభుత్వ ప్రకటనపై కూడా కవిత అనుమానం వ్యక్తం చేశారు. సిట్ ఏర్పాటు చేయడమే కాకుండా నిజంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అనే సందేహం ఉందన్నారు. చట్టం సక్రమంగా పనిచేస్తే సంతోష్‌రావుకు తప్పకుండా శిక్ష పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆరోపణల మధ్య, సంతోష్‌రావుకు బీఆర్ఎస్లోని కొందరు కీలక నేతలు మద్దతు ఇస్తున్నారని కవిత విమర్శించారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్‌రావు లాంటి నేతలు ఆయనకు ఎందుకు అండగా నిలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీకి నష్టం కలిగించిన వ్యక్తిని సమర్థించడం వల్ల భవిష్యత్తులో మరింత నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వంపైనా...
ఇక మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో నేరాలు పెరిగిపోయాయని, ముఖ్యంగా మహిళా అధికారులకే రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. నేరస్థులకు పోలీసులంటే గానీ, చట్టాలంటే గానీ భయం లేకుండా పోయిందని కవిత మండిపడ్డారు. ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో ఈ శాఖల అధికారులకు ఉన్న ఆయుధాలను తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారుల వద్ద వెపన్స్ ఉంటేనే స్మగ్లర్లు, అసాంఘిక శక్తులు వెనకడుగు వేస్తారని అభిప్రాయపడ్డారు.