BANDI:ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చేశారు: బండి సంజయ్
ఫలితాలను ముందే ఊహించామన్న కేంద్రమంత్రి... కేజ్రీవాల్ ను ప్రజలు నమ్మలేదని వ్యాఖ్య;
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేయడంతో కాషాయ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీకి 40కుపైగా స్థానాలు దక్కడంతో ఆ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. అధికార ఆప్ 25 స్థానాలకే పరిమతమయ్యేలా ఉంది. ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని తాము ముందే ఊహించామన్నారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఢిల్లీలో ఆప్ నేతలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పుడు వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బండి సంజయ్ స్పష్టం చేశారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు తమకు వద్దని ఢిల్లీ ప్రజలు ఆప్‌ను వద్దనుకున్నారు. అవినీతి, అక్రమాలతో జైలుకు వెళ్లిన వ్యక్తిని ఢిల్లీ తిరస్కరించిందని బండి సంజయ్ అన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని... రాష్ట్రపతిని, ప్రధానిలను ఎదిరించి వారికిష్టం వచ్చినట్లు ఢిల్లీలో కేజ్రీవాల్ పాలించిందన్నారు.
తెలుగువారు ఉన్న స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. 40 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్న న్యూఢిల్లీ, కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ కు ఊహించని షాక్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది. 40కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఆప్ రెండో స్థానంలో ఉంది. ఇది ఇలా ఉంటే.. ఇప్పటికే రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవని కాంగ్రెస్.. ఈ సారి ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని భావించింది. అయితే ఈ సారి కూడా కనీసం ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు షాక్ కి గురవుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ సీఎం సంచలన ట్వీట్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దుమ్ము లేపుతుంది. ప్రస్తుతం 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతోన్నారు. ఇక ఢిల్లీ ఫలితాలపై జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్ధుల్లా ఘాట్ ట్వీట్ చేశారు. 'ఇండి' కూటమిలోని పార్టీలు కొట్టుకుంటూ ఉంటే.. ఫలితాలు ఇలానే ఉంటాయంటూ ఆప్, కాంగ్రెస్ లను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. దీంతో పాటు రామాయణం వీడియోను షేర్ చేశారు.