సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ టిడిపి ఎమ్మెల్యేలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గంలో ఇన్చార్జిలపై నిఘా పెడుతున్నారు. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని నిర్లక్ష్యం చేసే వారిని ఉపేక్షించట్లేదు. ఏది ఏమైనా సరే ప్రజలతో మమేకం అవుతున్న వారికే పెద్ద పీట వేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు, లోకేష్ పదే పదే చెబుతున్నారు. మొన్న జరిగిన సమావేశంలో 43 మంది ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పద్ధతి మార్చుకోవాలని ప్రజలతో మమేకం కావాలని సూచించారు. పార్టీ లైన్ దాటేవారిని ఉపేక్షించేది లేదని.. చర్యలు కఠినంగా ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. గతంలో మాదిరిగా పార్టీని పక్కన పెట్టేసి సొంత రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమంలోనే జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో మంత్రి లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. ప్రజలతో మమేకం కాని ఇద్దరు మంత్రులు, గ్రీవెన్స్ నిర్వహించని 23 మంది ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. తీరు మార్చుకోకపోతే చర్యలు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటాయని సూచించారు. అందరికీ పార్టీనే సుప్రీం అని.. ఏ ఒక్కరికీ ఈ విషయంలో మినహాయింపు ఉండదన్నారు.
పార్టీ ఇచ్చిన నినాదాలను, సిద్ధాంతాలను, బాధ్యతలను కచ్చితంగా నిర్వహించాలన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి కష్టపడి పనిచేసే వారికి కచ్చితంగా పదవులు వస్తాయని అందుకు తనది హామీ అన్నారు. గతంలో మాదిరిగా డబ్బున్నవారికి, సామాజిక బలం ఉన్న వారి కంటే కూడా పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు నారా లోకేష్. పార్టీని మించి ఎవరైనా నియోజకవర్గాల్లో ఎదగాలని చూస్తే ఊరుకునేది లేదని.. పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాలన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి బలం పెంచే విధంగా ప్రజలతో నిత్యం మమేకం అవుతూనే ఉండాలని తెలిపారు. ఈ విధంగా లేని వారికి అతి త్వరలోనే చర్యలకు సంబంధించిన న్యూస్ వెళుతుందన్నారు.