Chandrababu: డప్పు వాయించి.. గిరిజన నృత్యంతో ఆకట్టుకున్న చంద్రబాబు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఏం;
ఏపీ సీఎం చంద్రబాబు ప్రవర్తన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆయన వ్యవహరించే తీరు ఒక సామాన్యుడిని తలపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు తన వ్యవహార శైలితో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న చేనేత దినోత్సవం రోజున ఎగ్జిబిషన్‌కు వెళ్లి అక్కడ అందరితో ఆయన మాట్లాడిన తీరు ఆకట్టుకుంది.
గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలన అంతానికి పోరాడి ప్రాణ త్యాగం చేశారు. స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాగలిగారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారత్. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే నా ఆకాంక్ష. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందాలి. ప్రధాని వచ్చినప్పుడు అరకు కాఫీ రుచి చూపించాం.
తెదేపా ప్రభుత్వ హయాంలో ఏటా ఆదివాసీ దినోత్సవం నిర్వహించాం. గత ఐదేళ్లలో ఈ దినోత్సవాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆదివాసీలంటే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు. దేశవ్యాప్తంగా 10.42 కోట్ల మంది గిరిజనులున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27.39 లక్షల మంది ఉన్నారు’’ అని చంద్రబాబు తెలిపారు.