AP: నాది విజన్‌... జగన్‌ది పాయిజన్‌

జగన్‌ మార్క్‌ పాలనంతా విధ్వంసమే... మండిపడ్డ తెలుగుదేశం అధినేత చంద్రబాబు

Update: 2024-01-30 00:30 GMT

జగన్‌ మార్క్‌ పాలనంతా విధ్వంసమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తనది విజన్ అయితే జగన్ ది పాయిజన్ అని విమర్శించారు. చేబ్రోలు, రాజమహేంద్రవరంలో నిర్వహించిన "రా కదలిరా"సభల్లో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. జగన్‌ దెబ్బకు సొంత పార్టీ నేతలే పారిపోతున్నారని తాము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీని గద్దె దింపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తొలుత రాజమహేంద్రవరం వెళ్లిన ఆయన భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి.. రాజమహేంద్రవరం రంకేసిందని చమత్కరించారు. వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకుల బొమ్మలు పెట్టి వికృత పనులను చేస్తున్నా ప్రజల కోసం భరిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. తాము జగన్‌ చిత్రం పెట్టి అలా చేస్తే పోలీసులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు.


జగన్ పాలనలో ఊరికొక దళితుణ్ని బలిచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక చోట చెత్త మరో చోట బంగారం అవుతుందా అంటూ నేతలను నియోజకవర్గాలు మార్చడంపై చంద్రబాబు ఎద్దేవా చేశారు. తర్వాత గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలులో జరిగినసభలో పాల్గొన్న చంద్రబాబు........ 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్నారు. జగన్‌ మార్కు అంటూ కొత్తగా చేస్తున్న ప్రచారంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందేన్న చంద్రబాబు..... తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.


KGFని మరిపించేలా.... పొన్నూరులో గ్రావెల్‌ ఫీల్డ్‌ చేపట్టారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 700 ఎకరాల్లోని 2 వేల కోట్ల రూపాయల విలువైన గ్రావెల్‌ తరలించారని... మండిపడ్డారు. గ్రావెల్‌ దోపిడీని అడ్డుకున్న ధూళీపాళ్ల నరేంద్రపై దాడి చేశారని... అధికారంలోకి వచ్చాక వైకాపాకు చక్రవడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన రా...కదలిరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రం మళ్లీ పురోగతి సాధించాలంటే.... తెలుగుదేశం, జనసేన గెలుపు చారిత్రక అవసరమన్నారు.

రివర్స్ నిర్ణయాలతో రివర్స్ పాలన చేయడమే జగన్ మార్క్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి రాజధానిని జగన్ నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొన్నూరు పౌరుషం చూపించాలని పిలుపునిచ్చారు. గంజాయి సరఫరాలో ఏపీ నంబర్ వన్ చేశారంటూ మండిపడ్డారు. అనేక తప్పుడు నిర్ణయాలతో జగన్ ఏపీని ధ్వంసం చేశారన్నారు.

Tags:    

Similar News