Chandrababu : తెలుగు మాధ్యమం కనుమరుగవుతుందని వింటుంటే బాధగా ఉంది : చంద్రబాబు

Chandrababu : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు;

Update: 2022-08-29 12:30 GMT

Chandrababu : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.. గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్న మనం.. ఇప్పుడు తెలుగును పరిరక్షించుకునేందుకు ఇంకా పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏపీ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యమం కనుమరుగవుతుందని వింటుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం నుంచి ఇలా పూర్తిగా మాతృ భాష బోధనా భాషగా మాయం కావడమనేది దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. దేశంలో భాషా ప్రాతిపదికగా ఏర్పడిన తొలి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు.

ఒక జాతి పురోగమన మార్గాన్ని ముందుండి నడిపించేది తల్లి భాషని.. తెలుగును వాడుక భాషగా సామాన్యులకు చేరువ చేసేందుకు ఆనాడు గిడుగు రామ్మూర్తి పెద్ద పోరాటమే చేశారని చెప్పారు. టీడీపీ హయాంలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి 2018లో ఏపీ తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్ధను ఏర్పాటు చేశామని అని చంద్రబాబు అన్నారు. తెలుగు అకాడమీని తెలుగు, సంస్కృత అకాడమీగా పేరు మార్చాక 63 కోట్ల రూపాయల నిధులు గోల్‌ మాల్‌ అయ్యాయన్న వార్త తప్ప.. ఆ సంస్థ తెలుగు భాష కోసం ఏం చేస్తుందనేది ఎవరికీ తెలియదన్నారు చంద్రబాబు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ.. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు మనందరం పునరంకితం అవ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు.


Tags:    

Similar News